కొలంబియా: ఈశాన్య కొలంబియాలోని నోర్టే డి శాంటాండర్ ప్రావిన్స్‌లో బుధవారం విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు. విమానంలో ప్రయాణించిన ఏ ఒక్కరి ప్రాణాలు దక్కలేదని ప్రభుత్వ విమానయాన సంస్థ సటేనా తెలిపింది. కురాసికాలోని స్థానిక అధికారులు ప్రమాద స్థలం గురించి అధికారులను అప్రమత్తం చేశారు.
రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అప్పటికే విమానం మంటల్లో కాలి బూడిదవడంతో ప్రయాణికులను కాపాడే అవకాశం లేకుండా పోయింది. ఈ విమాన ప్రమాదంలో.. కొలంబియా పొలిటీషియన్ డయోజెనెస్ క్వింటెరో కూడా చనిపోయారు. మార్చిలో కొలంబియాలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న కార్లోస్ సాల్సెడో కూడా చనిపోయిన వారిలో ఉన్నారు.
కొలంబియా రవాణా మంత్రిత్వ శాఖ ఈ ప్రమాద ఘటనను ధృవీకరించింది. HK4709 విమానం.. బుధవారం ఉదయం 11:42 గంటలకు కుకుటా విమానాశ్రయం నుంచి ఒకానాకు విమానం బయల్దేరింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్ తెగిపోయింది.
సటేనా తెలిపిన వివరాల ప్రకారం.. విమానం బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో ఇద్దరు సిబ్బంది, 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆ ప్రాంతంలో అంతర్గత సాయుధ సంఘర్షణ బాధితుల ప్రతినిధి డయోజెనెస్ క్వింటెరో కూడా ఉన్నారు. ఈ విమాన ప్రమాదానికి ప్రస్తుతానికైతే కారణాలు తెలియలేదు.
