ఓల్డ్‌సిటీ వెలుగు: నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్ మీర్ అక్బర్ అలీ (32)పై మూడోసారి పీడీ యాక్ట్ నమోదు చేసి, గురువారం చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.
యాకుత్‌పురా గంగానగర్ నాలా ప్రాంతానికి చెందిన మీర్ అక్బర్ అలీ వృత్తిరీత్యా డీసీఎం డ్రైవర్. ఇతనిపై గతంలో హత్య, హత్యాయత్నం, దోపిడీ, డ్రగ్స్విక్రయం, ఆర్మ్స్ యాక్ట్ వంటి సుమారు 25 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో ఇతనిపై రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో మూడోసారి ఈ కఠిన చట్టాన్ని అమలు చేశామని రైన్ బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సీహెచ్ నేతాజీ
తెలిపారు.
