ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగాలి : కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగాలి :  కలెక్టర్‌ అభిలాష అభినవ్‌
  •     కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్, వెలుగు: ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని నిర్మల్​ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని గురువారం కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్​ కలెక్టర్‌ ఫైజాన్‌ అహ్మద్‌తో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. వేడుకలను ప్రారంభించి మాట్లాడారు.

నేటి సమాజంలో బాలురతో సమానంగా బాలికలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని కొనియాడారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక రంగాల్లోనూ బాలికలు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు. జిల్లాలోని కేజీబీవీలు, వసతి గృహాల్లో విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పిస్తూ వారి మేధోవికాసానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.

బేబీ ఫీడింగ్‌ రూమ్‌ ప్రారంభం

పనుల కోసం చంటి పిల్లలతో కలెక్టరేట్‌కు వచ్చే మహిళా సందర్శకుల సౌకర్యార్థం ప్రజావాణి హాలు సమీపంలో ఏర్పాటు చేసిన ‘బేబీ ఫీడింగ్‌ రూమ్‌’ను అడిషనల్​కలెక్టర్​తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. కార్యాలయాలకు వచ్చే తల్లులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వాహిద్, డీఈశో భోజన్న, డీఆర్‌డీవో విజయలక్ష్మి, సీడీపీవోలు, టీచర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.