హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి నోటీసు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. న్యాయ నిపుణుల అభిప్రాయం తర్వాత మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని కేసీఆర్ రాసిన లేఖకు సిట్ శుక్రవారం సమాధానం ఇవ్వనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే విచారణను ఎదుర్కొన్న అధికారుల స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్‌కు 160 సీఆర్పీసీ కింద సిట్ మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
కేసీఆర్‌ను ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని గంటలకు ప్రశ్నిస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఫోన్ట్యాపింగ్కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్పాత్రపై సిట్ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. టెలికాం డిపార్ట్‌మెంట్ నుంచి అందిన 618 ఫోన్నంబర్లతో కూడిన లిస్ట్ ఆధారంగా బాధితులు, సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.
ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు సహా నిందితులు మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్‌రావును పలుమార్లు కస్టడీకి తీసుకుని విచారించింది. నాటి సీఎంవో ఆదేశాల మేరకే బీఆర్ఎస్ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులు, వ్యాపారవేత్తలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్లు నిందితులు వెల్లడించారు.
మరోవైపు ప్రగతి భవన్ కేంద్రంగా ఫోన్‌ట్యాపింగ్ స్కెచ్ వేసినట్లు సంతోష్‌రావు కూడా స్పష్టం చేశారు. దీనికి తోడు ఫాంహౌస్ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ట్యాపింగ్జరిగినట్లు సిట్నిర్ధారణకు వచ్చింది. ఆనాడు సీఎం హోదాలో కేసీఆర్స్వయంగా ఆ ట్యాపింగ్ఆడియోలను బయటపెట్టడాన్ని ప్రధాన సాక్ష్యంగా సిట్పరిగణిస్తోంది. వీటన్నింటిపైనా కేసీఆర్‌ను వివిధ కోణాల్లో ప్రశ్నించేందుకు సిట్ సిద్ధమైంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాను సిట్ విచారణకు హాజరుకాలేనని కేసీఆర్తెలిపారు. ఈ మేరకు గురువారం సిట్ ఏసీపీ పి.వెంకటగిరికి రిప్లై ఇచ్చారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందున అభ్యర్థులను తానే ఫైనల్ చేయాల్సి ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విచారణకు రాలేనని, మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు.
సీఆర్పీసీ సెక్షన్160 ప్రకారం.. 65 ఏండ్లు దాటిన వ్యక్తులు స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, కాబట్టి సిద్దిపేట జిల్లాలోని తన ఎర్రవల్లి (ఫాంహౌస్) నివాసానికే అధికారులు రావాలని కోరారు. విచారణకు వచ్చే ముందు మరోసారి నోటీసులు ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి నోటీసులైనా ఎర్రవల్లి అడ్రసుకే పంపాలని విన్నవించారు. మాజీ సీఎంగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.
