15 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి.. బడ్జెట్ ముందు మార్కెట్లకు ఏమైంది..?

15 నిమిషాల్లో రూ.4 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి.. బడ్జెట్ ముందు మార్కెట్లకు ఏమైంది..?

ఆర్థిక సర్వే 2026 ఇచ్చిన ఊపుతో గురువారం జనవరి 29న లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం అదే జోరు కొనసాగించలేకపోయాయి. ఉదయం ట్రేడింగ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్కింగ్ కోసం ఎగబడటంతో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లోకి జారుకున్నాయి. బడ్జెట్ ప్రసంగానికి చివరి ట్రేడింగ్ సెషన్ కావటంతో ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 

ఉదయం 10.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 408 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 112 పాయింట్లు కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 94 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 110 పాయింట్ల నష్టంతో తమ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు బడ్జెట్ సెషన్ ముందు తిరిగి అమ్మకాలకు దిగటంతో దేశీయ  పెట్టుబడిదారుల సెంటిమెంట్లు కూడా దెబ్బతిన్నాయి. 

ALSO READ : గోల్డ్ సిల్వర్ ర్యాలీకి బ్రేక్..

ప్రధానంగా నేడు మెటల్ స్టాక్స్ భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టీ మెటల్స్ ఇండెక్స్ 4 శాతం పతనం అయ్యింది. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో చూసిన 8.5 శాతం లాభాల నుంచి వెనక్కు తగ్గటం గమనార్హం. ప్రధానంగా అంతర్జాతీయంగా బేస్ మెటల్ రేట్లు అత్యధికంగా ఉండటం ఆందోళనలకు దారితీసింది. దీంతో ఇన్వెస్టర్లు కూడా వెనక్కి తగ్గి లాభాలను తీసుకుంటున్నారు. ఇక మార్కెట్లను ప్రభావితం చేసిన మరో ముఖ్యమైన అంశం క్రూడ్ ఆయిల్ రేట్లు. గురువారం ధరలు ఒక్కసారిగా 5 నెలల గరిష్ఠాన్ని తాకటంతో అంతర్జాతీయంగా ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ప్రధానంగా ఇరాన్ పై అమెరికా దాడి గురించి ఆందోళనలతో క్రూడ్ ఆయిల్ రేట్లు కుతకుతలాడుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి ఇండియాకు ప్రతికూలమైనదని తెలిసిందే.