- పీఎం శ్రీ స్కూళ్లలో 34 రోజులు.. సాధారణ బడుల్లో 19 రోజులే..
- అధికారుల తీరుపై మండిపడుతున్న హెడ్మాస్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ అందించే విషయంలో విద్యాశాఖ వింత వైఖరి ప్రదర్శిస్తున్నది. ఒకే సిలబస్ చదువుతూ, ఒకే రకమైన పరీక్షకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల మధ్య స్కూల్ బోర్డు పేరుతో తారతమ్యం చూపుతున్నది. ‘పీఎం శ్రీ’ స్కీము కింద ఎంపికైన బడులకు ఎక్కువ రోజులు స్నాక్స్ అందిస్తుండగా, అత్యధిక విద్యార్థులు చదువుతున్న సాధారణ గవర్నమెంట్, జడ్పీ బడులకు తక్కువ రోజులు అందిస్తున్నది. మార్చి14 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
మొత్తంగా 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కాబోతున్నారు. అయితే, చాలా స్కూళ్లలో నవంబర్, డిసెంబర్ నుంచే సాయంత్రం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. వారందరికీ జనవరి ఒకటో తేదీ నుంచే స్నాక్స్ అందించేందుకు అనుమతి ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్... విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.
ఫైనాన్స్ శాఖ నుంచి సానుకూలత రాకపోవడంతో పెండింగ్ లో పడింది. ఈ క్రమంలోనే 532 పీఎం శ్రీ స్కూళ్లలో ఈ నెల 28 నుంచే స్నాక్స్ పంపిణీ మొదలుపెట్టారు. దీన్ని మార్చి 10 వరకు అంటే 34 రోజుల పాటు అందించనున్నట్టు ఉత్తర్వులు రిలీజ్ చేశారు. దీంతో వీటిలో సుమారు 46 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. అయితే, మెజార్టీ విద్యార్థులు చదువుతున్న జడ్పీ, గవర్నమెంట్ స్కూల్స్‌లోని విద్యార్థులను మాత్రం విస్మరించారు.
ఆయా బడుల్లో చదివే విద్యార్థులకు మాత్రం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు ఇస్తామని ఉత్తర్వులు ఇచ్చారు. అంటే కేవలం 19 రోజులు మాత్రమే. ‘ఒకే సిలబస్.. ఒకే పరీక్ష.. ఒకే సమయం.. మరి ఆకలిలో ఎందుకీ తేడా?’అని హెడ్మాస్టర్లు, టీచర్ల సంఘాలు అధికారులను ప్రశ్నిస్తున్నాయి. బోర్డు పేరు మారినంత మాత్రాన పిల్లల ఆకలి మారుతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ అడ్జెస్ట్మెంట్ పేరుతో సాధారణ స్కూల్ పిల్లల కడుపు కొట్టడం సరికాదని, తక్షణమే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ స్నాక్స్ పంపిణీని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
