హైదరా బాద్ మీర్ చౌక్ లోని ఇంట్లో వృద్ధ అన్నాచెల్లెలు మృతి

 హైదరా బాద్ మీర్ చౌక్ లోని ఇంట్లో వృద్ధ అన్నాచెల్లెలు మృతి
  • అనారోగ్యం, ఒంటరితనమే కారణం!

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మీర్ చౌక్ లోని సుల్తాన్‌‌‌‌పురాలోని  సర్దార్ జీ కాంప్లెక్స్​లో ఇద్దరు వృద్ధుల మృతదేహాలు కలకలం రేపాయి. ఇంటి చుట్టుపక్కలవారికి దుర్వాసన వస్తుండడంతో మీర్​చౌక్​పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి లోపలకు వెళ్లి చూడగా కుళ్లిపోయిన స్థితిలో రెండు డెడ్​బాడీలు కనిపించాయి. మృతులను ఎండీ షకీల్(80) , అతని సోదరి సర్వార్ బేగం(85) (దివ్యాంగురాలు)గా గుర్తించారు. 

ఒకే గదిలో సర్వార్ బేగం కుర్చీలో కూర్చుని మరణించగా, షకీల్ కింద పడిపోయిన స్థితిలో ఉన్నాడు. అన్నా చెల్లెలు ఐదారురోజులుగా బయటకు రావడం లేదు. వీరు చనిపోయి రెండు నుంచి మూడు రోజులు అయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు.

మృతదేహాలను పోస్ట్‌‌‌‌మార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. సహజ మరణమా లేక ఆత్మహత్య లేదా ఇతర కారణాలా అనేది దర్యాప్తు తర్వాతే తేలుతుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని, వృద్ధుల ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం కారణంగా సహజ మరణమే జరిగి ఉండవచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కాగా, ఇద్దరూ అవివాహితులేనని.. గత 40 ఏండ్లుగా  అదే ఇంట్లో కలిసి నివసిస్తున్నారని తెలిసింది. సర్వార్ బేగం వికలాంగురాలై, నడవలేని స్థితిలో ఉండటంతో ఆమె బాధ్యతలన్నీ సోదరుడు షకీల్ చూసుకుంటున్నాడు. అత్యంత పేదరికంలో ఉండటంతో సమీప బంధువులు కూడా దూరమైపోయినట్లు స్థానికులు తెలిపారు. ఎండీ షకీల్ గతంలో న్యాయవాదిగా, చార్డర్డ్​అకౌంటెంట్​గా పని చేశాడు.