- కలెక్టర్లకు బీసీ సంక్షేమ శాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రెడ్డి గాండ్ల కులానికి చెందిన వ్యక్తులకు బీసీ సర్టిఫికెట్లు జారీ చేయొద్దని బీసీ సంక్షేమ శాఖ.. కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కొన్ని పాత ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ బీసీ రిజర్వేషన్లు అర్హులైన వారికే అందేలా చూడాలని చెప్పింది. ఎన్నికల అధికారులు, సంబంధిత శాఖలు కూడా ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. రెడ్డి గాండ్ల వ్యక్తులు బీసీ రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలను మరోసారి జారీ చేసింది.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ను దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలకు చెందిన అభ్యర్థులను బీసీలుగా పరిగణించరాదని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొందరు అనర్హులు బీసీ కోటా కింద ఎన్నికైనట్లు గుర్తించినందున సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
