మేడారం అభివృద్ధికి సహకరిస్తాం.. అభివృద్ధి పనులు బాగున్నయ్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కితాబు

మేడారం అభివృద్ధికి సహకరిస్తాం.. అభివృద్ధి పనులు బాగున్నయ్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కితాబు
  • త్వరలో ములుగు ట్రైబల్ వర్సిటీకి ప్రధాని మోదీతో భూమి పూజ
  • రామప్ప ప్రాంతంలో రూ.140 కోట్లతో పర్యాటకులకు వసతులు 
  • రూ.80 కోట్లతో ములుగు జిల్లా టూరిజం ప్రాంతాల అభివృద్ధి  
  •  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‍రెడ్డి  
  • మరో కేంద్ర మంత్రి జువల్‍ ఓరంతో కలిసి అమ్మవార్లకు మొక్కులు  
  • జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని రాష్ట్ర మంత్రుల వినతి 

వరంగల్‍, వెలుగు : ములుగు జిల్లా కేంద్రంగా రూ.890 కోట్లతో నిర్మించబోయే సమ్మక్క, సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీకి త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీతో భూమిపూజ చేయించనున్నట్టు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‍రెడ్డి తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్‍ ఓరంతో కలిసి గురువారం మేడారం జాతరకు వెళ్లారు. 

కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వాగతం పలికారు. అమ్మవార్లకు కేంద్ర మంత్రులు నిలువెత్తు బంగారాన్ని(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించారు.  అనంతరం మీడియా సమావేశంలో కిషన్‍రెడ్డి మాట్లాడారు.

 గిరిజన యూనివర్సిటీతో స్థానిక ఆదివాసులకు విద్యవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ‘ప్రధానమంత్రి జన్ యోజన’ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నామ న్నారు. 

అచ్చంపేట, వికారాబాద్‍, ఆదిలాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గిరిజన ప్రాంతా లను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ఆదివాసీ జాతి కోసం పోరాడిన బిర్సా ముండా  జన్మదినాన్ని జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు.  

రాష్ట్రంతో కలిసి అభివృద్ధి చేస్తాం..

 మేడారం ప్రాంతాన్ని  రాష్ట్ర ప్రభుత్వంతో  కలిసి అభివృద్ధి చేస్తామన్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే జాతరకు ఆధునీకరణ పనులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ఈసారి జాతరకు కేంద్రం నుంచి రూ.3.70 కోట్ల నిధులు కేటాయించామన్నారు. భవిష్యత్ లో మరింత సహకారం అందించనున్నట్లు వెల్లడించారు.

 రూ.80 కోట్లతో ములుగు, లక్నవరం, బొగత, తాడ్వాయి, మల్లూరు ప్రాంతాలను టూరిజం శాఖ ద్వారా అభివృద్ధి చేశామన్నారు. రామప్ప ఆలయానికి  యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకొచ్చామన్నారు. రూ.140 కోట్ల నిధులతో ఆలయ ఆవరణలో పర్యాటకుల వసతుల కల్పనకు ఖర్చు చేస్తున్నామన్నారు.

  కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జువల్‍ ఓరం మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో మేడారం జాతరను సందర్శించామన్నారు. 20 ఏండ్ల తర్వాత మరోసారి మేడారం వచ్చే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు.  మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్రమంత్రులకు రాష్ట్రమంత్రులు వినతిపత్రం అందించారు. 

సీఎం సంకల్ప బలంతో గద్దెల ఆధునీకరణ: మంత్రి సీతక్క 

మేడారంలో భక్తజనానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని  మంత్రి సీతక్క తెలిపారు.  40 రోజుల ముందు నుంచే లక్షల మంది దర్శించుకుంటు న్నారన్నారు. సీఎం సంకల్ప బలంతో అమ్మవార్ల గద్దెల ఆధునీకరణ జరిగింద ని పేర్కొన్నారు. 

సీఎం, మంత్రులకు తల్లుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయ న్నారు. ఆలయ పునర్నిర్మాణం, పున: ప్రారంభం బాధ్యతగా నిర్వహించార న్నారు. భక్తులు ఈజీగా దర్శనం చేరుకుంటున్నారని చెప్పారు. ఆదివాసీ పూజారుల విశ్వాసం, భక్తుల విశ్వాసాలు మరింత రెట్టింపు అయ్యాయన్నారు.