కోల్బెల్ట్, వెలుగు: వనంలోంచి జనంలోకి వచ్చిన సమ్మక్క–సారలమ్మలను చూసిన భక్తులు పరవశించిపోయారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, గుస్సాడీ నృత్యాలు, భారీ బందోబస్తుతో గురువారం సాయంత్రం పొద్దుపోయాక సమ్మక్క గద్దెకు చేరుకుంది. మంచిర్యాల, రామకృష్ణాపూర్లో జాతరలు జరిగే గోదావరి, పాలవాగు తీరాల్లో తల్లులను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. మందమర్రి అంగడిబజార్లోని ఓ భక్తుని ఇంటి నుంచి సమ్మక్క తల్లిని ఆర్కే1ఏ గని సమీపానికి తీసుకొచ్చారు.
అక్కడి నుంచి భారీ జనసమూహంతో సమ్మక్కను ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మందమర్రి సింగరేణి జీఎం రాధాకృష్ణ–శ్రీవాణి దంపతులు, ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి సీతారామయ్య, డీసీసీ ప్రెసి డెంట్ రఘునాథ్ రెడ్డి, రాజకీయ, కార్మిక సంఘాల లీడర్లు వనదేతలను దర్శించుకున్నారు.
అరటిపల్లిలో గద్దెనెక్కిన తల్లులు
తిర్యాణి, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కన్నెపల్లి పరిధిలో అరటిపల్లి స్టేజి వద్ద సమ్మక్క–సారలమ్మ జాతర ఘనంగా సాగుతోంది. కోయ పూజారుల ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య సమ్మక్కను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. తిర్యాణి ఎస్సై వెంకటేశ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా నేత జువ్వాజి అనిల్ గౌడ్, సర్పంచ్లు తుమ్రం మాన్కు, వెడ్మ నరేశ్, ఆత్రం శంకరమ్మ నిర్వహణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల, శ్రీరాంపూర్ లో..
మంచిర్యాలలోని గోదావరితీరంలోని జాతర ప్రాంగణం వద్దకు, శ్రీరాంపూర్ సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం సమీపంలో జాతర వద్దకు సింగరేణి కాలరీస్ హైస్కూల్ ప్రాంగణం నుంచి సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. ఏరియా ఏస్వోటుజీఎం సత్యనారాయణ–అరుణ దంపతులు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ వీరభద్రరావు–కవిత దంపతులు, ఆఫీసర్లు, లీడర్లు పూజలు చేశారు.
