మళ్లీ వెనక్కి వెళ్తున్నామా..? యూజీసీ కొత్త రూల్స్‎పై సుప్రీంకోర్టు ఫైర్

మళ్లీ వెనక్కి వెళ్తున్నామా..? యూజీసీ కొత్త రూల్స్‎పై సుప్రీంకోర్టు ఫైర్
  • సమాజంలో విభజన తెచ్చేలా ఉన్నాయని కామెంట్​
  • అమెరికాలో తెల్ల, నల్ల వాళ్లకు వేర్వేరు స్కూల్స్.. అలాంటి పరిస్థితి మనకొద్దని వ్యాఖ్య
  • కొత్త రూల్స్‌‌ అమలుపై స్టే.. పాత రూల్స్ కొనసాగించాలని ఆదేశం
  • కేంద్ర ప్రభుత్వం, యూజీసీకి నోటీసులు జారీ.. తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా
  • కులవివక్షపై యూజీసీ తెచ్చిన రూల్స్‌‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ

న్యూఢిల్లీ: ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్షను రూపుమాపేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త రూల్స్ అస్పష్టంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కొత్త రూల్స్ అమలుపై స్టే విధిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, యూజీసీకి నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రస్తుతమున్న 2012 నిబంధనలనే అమలు చేయాలని స్పష్టం చేసింది. యూజీసీ తెచ్చిన కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్యా బాగ్చీతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. యూజీసీ కొత్త రూల్స్ సమాజంలో విభజన తెచ్చే విధంగా ఉన్నాయని కామెంట్ చేసింది. మనం మళ్లీ వెనక్కి వెళ్తున్నామా? అని ప్రశ్నించింది. మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లయినా కులవివక్షను రూపుమాపలేకపోయామని వ్యాఖ్యానించింది. ‘‘75 ఏండ్ల స్వతంత్ర భారతంలో కులరహిత సమాజ నిర్మాణం దిశగా మనం ఏం సాధించాం? ఈ విషయంలో మనం మళ్లీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా? విద్యాసంస్థల్లో చదువుకునేందుకు ఉత్తరాది, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు.. ఇలా దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వస్తారు. 

వాళ్లందరూ తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. అలాంటి వారిని ర్యాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో కొందరు అవహేళన చేస్తుండటం బాధాకరం. దాన్ని అరికట్టేందుకు ప్రత్యేక హాస్టళ్లు ఉండాలని కొందరు అంటున్నారు. కానీ, ప్రస్తుత సమాజంలో కులాంతర వివాహాలే జరుగుతున్నాయి. హాస్టళ్లలోనూ అందరూ కలిసే ఉంటున్నారు. అలాంటప్పుడు మళ్లీ విభజనలు ఎందుకు? విద్యాసంస్థల్లో ఐక్యత ప్రతిబింబించాలి. అక్కడ స్వేచ్ఛాయుత, సమానత్వ, సమ్మిళిత వాతావరణాన్ని మేం కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది. ‘‘అమెరికాలో శ్వేత జాతీయులు, నల్ల జాతీయులకు వేర్వేరు స్కూల్స్ ఉంటాయి. కానీ మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లొద్దని మేం కోరుకుంటున్నాం. అలాంటి పరిస్థితే వస్తే, అది మన విద్యావ్యవస్థనే నాశనం చేస్తుంది” అని ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇవీ వాదనలు.. 

యూజీసీ కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కులవివక్షకు సరైన నిర్వచనం ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు లాయర్ విష్ణుశంకర్ జైన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కులవివక్ష నిర్వచనాన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు మాత్రమే పరిమితం చేశారు. ఇందులో జనరల్ కేటగిరీ విద్యార్థులను చేర్చలేదు. ఇదీ ఒక రకంగా వివక్ష చూపడమే. జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా కులం ఆధారంగా వివక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ వాళ్లు ఫిర్యాదు చేయడానికి ఎలాంటి మెకానిజం లేదు” అని పేర్కొన్నారు. 

‘‘యూజీసీ రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3(సీ)ని మేం సవాల్ చేస్తున్నాం. ఇందులో కులవివక్షను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై వివక్షగా పేర్కొన్నారు. ఇక్కడ జనరల్ కేటగిరీ విద్యార్థులను పూర్తిగా మినహాయించారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు వ్యతిరేకం” అని వాదించారు. కులానికి తావివ్వనిరీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలా యూజీసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న కోర్టు.. యూజీసీ కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలుపై స్టే విధించింది. పాత రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నే అమలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను  మార్చి 19కి వాయిదా వేసింది. 

ఇదీ కేసు.. 

రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ కొత్త రూల్స్ రూపొందించింది. 2012 నాటి నిబంధనల స్థానంలో ఈ నెల 13 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈవోసీ) ఏర్పాటును తప్పనిసరి చేసింది. కులవివక్షకు సంబంధించిన ఫిర్యాదులపై విచారించేందుకు క్యాంపస్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వర్సిటీల్లో సమానత్వాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కులవివక్ష నిర్వచనాన్ని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు మాత్రమే పరిమితం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో యూజీసీ నిబంధనలను సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.