- ముందు జాగ్రత్తగా నామినేషన్ వేస్తున్న నాయకులు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నామినేషన్ల దాఖలుకు ఒక్క రోజే గడువు ఉంది. ఇంకా ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామంటున్న ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలు, జిల్లా పార్టీ అధ్యక్షులు అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. బుధ, గురువారాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.
ఇంకా చాలా వార్డుల్లో అభ్యర్థిత్వాలు ఖరారు కానేలేదు. ఆయా మున్సిపాలిటీల్లో పలు వార్డుల్లో ఆశావహులు ముగ్గురు, నలుగురు ఉండడంతో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై పార్టీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఎవరిని బరిలో దించుతారనే దానిని బట్టి పార్టీ టికెట్ ఖరారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
బీ ఫామ్ దాఖలుకు ఫిబ్రవరి 3 వరకు సమయం ఉండడంతో కొందరు ఆశావహులు టికెట్ ఖరారు కాకున్నా నామినేషన్ వేస్తున్నారు. ప్రధాన పార్టీల టికెట్లభించని నాయకులకు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్లు ఇచ్చి పోటీ చేయించేందుకు తెలంగాణా జాగృతి ప్రయత్నాలు చేస్తోంది.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 75 వార్డులు ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల మాత్రమే అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. మెదక్ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 స్థానాలకు, బీఆర్ఎస్ 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మిగతా వార్డులకు సంబంధించి అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాలేదు. బీజేపీ ఇంకా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాలేదు. రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో ఏ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ ఆశావహులు కొందరు నామినేషన్లు దాఖలు చేశారు.
సిద్దిపేట జిల్లాలో..
దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్ మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 72 వార్డులుండగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని వార్డులకు పోటీ చేస్తున్నాయి. మూడు రాజకీయ పార్టీల టికెట్లను ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో గెలుపు గుర్రాలతో పాటు రిజర్వేషన్ల ప్రకారం టికెట్ల కేటాయింపుపై దృష్టిపెట్టారు. దుబ్బాక మున్సిపాలిటీలో 9, చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను విడుదల చేశారు.
మిగిలిన మున్సిపాలిటీల్లో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుపుతుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే నామినేషన్ల దాఖలు చేస్తున్నారు. పెద్దగా పోటీ లేని వార్డులకు అభ్యర్థులను ఖరారు చేస్తూనే ఎక్కువ మంది పోటీ పడుతున్న చోట్ల బుజ్జగిస్తున్నారు. నామినేషన్ల దాఖలు ముగిసే నాటికి వీలైనన్ని స్థానాలకు టికెట్లు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీ నేతలు భావిస్తున్నారు. హుస్నాబాద్, చేర్యాలల్లో కాంగ్రెస్, హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులను రేపటికల్లా ఖరారుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో అభ్యర్థుల ఎంపిక మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్కోవార్డుకు ఇప్పటికే మూడేసి నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా అధికారికంగా పూర్తి స్థాయిలో క్యాండిడేట్లను ప్రకటించలేదు. జిల్లా వ్యాప్తంగా 11 మున్సిపాలిటీలు 256 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా గురువారం సదాశివపేట, సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్, జహీరాబాద్, అందోల్ -జోగిపేటలో బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి.
ఇంకా 9 మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్నాయి. ఆయా మున్సిపాలిటీలో మ్యాగ్జిమం వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉండడంతో టికెట్ ఎవరికి వస్తుందని ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లోని బలమైన క్యాండిడేట్ల వైపు చూస్తూ వారిని లాక్కుని టికెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.
