నిజం బయటపడింది.. బీజేపీ వరుస విజయాలకు ఓట్ చోరీనే కారణం: రాహుల్ గాంధీ

నిజం బయటపడింది.. బీజేపీ వరుస విజయాలకు ఓట్ చోరీనే కారణం: రాహుల్ గాంధీ

పాట్నా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ 50 ఏళ్లు అధికారంలో ఉంటుందని అమిత్ షా చెప్పడానికి కారణం ఓట్ చోరీనే అని ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా బీహార్‎లోని మధుబనిలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు అధికారంలో ఉంటామనే బీజేపీ చెప్పడం వెనక ఓట్ చోరీ ముడిపడి ఉందని ఆరోపించారు.

 ‘40-50 సంవత్సరాల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని అమిత్ షా చాలాసార్లు చెప్పారు. అన్ని సంవత్సరాలు పవర్‎లో ఉంటామని ఆయనకు ముందే ఎలా తెలుసు..? ఈ విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది. తీరా ఆరా తీస్తే దీని వెనక ఓట్ చోరీ ఉందనే సత్యం తెలిసింది’’ అని అన్నారు రాహుల్. 2017లో మధ్యప్రదేశ్‌లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో అమిత్ షా అమిత్ షా మాట్లాడుతూ.. మనం 5-10 సంవత్సరాలు అధికారంలో ఉండటానికి రాలేదని.. కనీసం 50 సంవత్సరాలు అధికారంలోకి ఉండటానికి వచ్చామని అన్నారు. 

40-50 సంవత్సరాలలో అధికారం ద్వారా మనం దేశంలో పెద్ద మార్పులు తీసుకురావాలి అనే నమ్మకంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అమిత్ షా వ్యాఖ్యలతో బీజేపీ చోరీ చేస్తుందనే నిజం దేశం ముందు బయటపడిందని అన్నారు. దేశంలో ఓట్ చోరీ మొదట గుజరాత్‌లో ఆ తర్వాత 2014లో జాతీయ స్థాయికి చేరుకుంది. ఆపై ఇతర రాష్ట్రాలకు కూడా చేరుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అబద్ధం చెప్పనని.. వాస్తవాల ఆధారంగానే మాట్లాడుతానని అన్నారు.