
చిన్న వర్షం వస్తే చాలు.. వీధులన్నీ వాగులైపోతాయి. రోడ్లన్నీ నదులైపోతాయి. పార్క్ చేసిన బైకులు కొట్టుకుపోయే పరిస్థితి. ఇది యూసుఫ్ గూడ-కృష్ణానగర్ లో వర్షం వస్తే ఉండే సుదీర్ఘ సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. మంగళవారం (ఆగస్టు 26) కమిషనర్ రంగనాథ్ కృష్ణానగర్ నాలాను పరిశీలించి సమస్యను పరిష్కరించే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు.
నాలాల్లో 8 అడుగుల లోతు, 6 అడుగుల మేర సిల్ట్ పేరుకుపోయింది. దీంతో జేసీబీలతో సిల్ట్ తీసే కార్యక్రమం చేపట్టారు. నాలా నుంచి 2 మీటర్ల మేర పూడిక తీయగానే 8 ట్రాక్టర్లు నిండుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం పూడిక తీత పనులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పూర్తి సిల్ట్ తొలగించేవరకు పనులు కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
యూసుఫ్ గూడ కృష్ణానగర్ ప్రాంతాల్లో మరో15 రోజుల్లో పనులు పూర్తిచేయాలని సూచించారు. సిల్ట్ తొలగితే గాయత్రి హిల్స్, యూసుఫ్‌గూడ బెటాలియన్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు సాఫీగా వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం.1లో జీవీకే డయగ్నాస్టిక్స్ వద్ద నాలాపై అక్రమంగా షెడ్డులు వేశారని కమీషనర్ కు ఫిర్యాదు స్థానికులు ఫిర్యాదు చేశారు. 5 మీటర్ల వెడల్పు ఉండాల్సిన నాలా కేవలం 2 మీటర్లకు పరిమితం అయ్యిందని చెప్పారు. స్థానికులు షెడ్డులు వేసి అద్దెకు ఇస్తున్నారని తెలిపారు. దీంతో వర్షం పడినప్పుడు నీరు రోడ్డులను ముంచెత్తుతోందని స్థానికుల ఫిర్యాదులో పేర్కొన్నారు.
స్థానికుల ఫిర్యాదు మేరకు ఆక్రమణలను తొలగించాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. షెడ్డులను ఖాళీ చేయడానికి కొంత సమయం ఇచ్చి, అయినా ఖాళీ చేయకుంటే తొలగించాలని సూచించారు.