జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లేవాళ్లు.. ఈ నర్సరీని చూసే ఉంటారు.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లేవాళ్లు.. ఈ నర్సరీని చూసే ఉంటారు.. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..
  • రూ.100 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా

జూబ్లీహిల్స్, వెలుగు: రెండు దశాబ్దాలకు పైగా జూబ్లీహిల్స్ ​చెక్​పోస్టుకు సమీపంలో కబ్జాకు గురైన జూబ్లీహిల్స్ ​కోపరేటివ్​ హౌసింగ్​ సొసైటీకి చెందిన సుమారు రూ.100 కోట్ల విలువైన 2 వేల గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. ఈ స్థలాన్ని ప్రజా అవసరాలకు ఉపయోగించాల్సి ఉండగా, సత్యనారాయణ అనే వ్యక్తి రెండు దశాబ్దాలుగా అందులో నర్సరీ నిర్వహిస్తున్నాడు. గతంలో జీహెచ్ఎంసీ పలుమార్లు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించగా, ఫేక్​ ఇంటి నంబర్​తో కోర్టును తప్పుదోవ పట్టించి స్టేటస్​కో ఆర్డర్​ తెచ్చుకున్నాడు.

షెడ్లు, నర్సరీ నిర్వహిస్తుండడంతో హౌసింగ్ సొసైటీ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. దీంతో సత్యనారాయణకు హైడ్రా నోటీసులు ఇచ్చారు. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇచ్చిన స్టేటస్​కోను రద్దు చేస్తూ, హైడ్రా తీసుకోబోయే చర్యలకు అనుమతి ఇవ్వడంతో సోమవారం హైడ్రా అధికారులు కూల్చివేతలు జరిపి ఆ స్థలాన్ని కబ్జా నుంచి విముక్తి చేశారు.