- ఈ నెల 1న కేజీ సిల్వర్ రూ.1.96 లక్షలు
- నెల రోజుల్లో రూ. 80 వేలు జంప్
- గత ఆరు రోజుల్లోనే రూ.48 వేలు పెరిగిన ధర
- డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి
- లేకపోవడంతో పీక్స్‌కు రేటు
న్యూఢిల్లీ: వెండి ధర పరుగులు పెడుతున్నది. బంగారంతో పోటీ పడుతూ పెరుగుతున్నది. ఈ నెల 1న రూ.1.96 లక్షలు పలికిన కిలో వెండి.. శనివారం నాటికి రూ.2.74 లక్షలకు చేరింది. అంటే ఒక్క నెలలోనే దాదాపు రూ.80 వేలు ( 39.80%) పెరిగింది. శనివారం ఒక్కరోజే ఏకంగా రూ.20 వేలు జంప్ అయింది. ఈ నెల 5 నుంచి వెండి రేటు క్రమంగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఈ నెల చివరి వారంలోనే ధర భారీగా పెరిగింది.
ఈ నెల 21న కిలో వెండి రూ.2.26 లక్షలు ఉండగా, 27 నాటికి రూ.2.74 లక్షలకు చేరింది. అంటే కేవలం ఆరు రోజుల్లోనే రూ.48 వేలు జంప్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్కారణంగానే సిల్వర్ రేటు పెరుగుతున్నదని అనలిస్టులు చెబుతున్నారు. ‘‘ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే వెండి ధర 2026లో మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు ఒక ఔన్స్ (28.3 గ్రాములు) సిల్వర్ రేటు 80 డాలర్లు ఉంది. ఇది 100 డాలర్ల వరకు చేరే చాన్స్ ఉంది.
అదే జరిగితే దేశీయంగా వెండి ధరలు రూ.3 లక్షల మార్కును చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు” అని అంటున్నారు. కాగా, హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరిలో కిలో వెండి ధర దాదాపు రూ.98 వేలు ఉండగా, ఇప్పుడది రూ.2.74 లక్షలకు చేరింది. అంటే ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.1.76 లక్షలు పెరిగింది. ఇక ఢిల్లీలో ఈ ఏడాది జనవరి 1న కిలో వెండి ధర రూ.90,500 ఉండగా, ఇప్పుడది రూ.2.51 లక్షలకు చేరింది. అంటే ఏకంగా 170 శాతానికి పైగా పెరిగింది.
రేటు పెరగడానికి కారణాలేంటి?
ఇండస్ట్రీల నుంచి డిమాండ్: వెండి ధర పెరగడానికి ప్రధాన కారణం.. పారిశ్రామికంగా వినియోగం పెరగడం. అంతర్జాతీయ మార్కెట్లో వెండి నిల్వలు తగ్గడం, ఇండస్ట్రీల నుంచి డిమాండ్ ఎక్కువ ఉండడంతో రేటు పెరుగుతున్నది. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్ల తయారీలో వెండిని భారీగా వాడుతున్నారు. వీటి తయారీ కోసం చైనా వంటి దేశాల నుంచి సిల్వర్‌కు ఫుల్ డిమాండ్ ఉంది.
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో వడ్డీ రేట్లను మూడుసార్లు తగ్గించింది. 2026లో కూడా మరిన్ని తగ్గింపులు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలహీనపడి.. ఇన్వెస్టర్లు వెండి, బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతారు.
తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్: ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తి క్రమంగా తగ్గుతున్నది. గత ఐదేండ్లుగా మార్కెట్లో లోటు కనిపిస్తున్నది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో ధర పెరుగుతున్నది. ముఖ్యంగా లండన్ మార్కెట్లలో వెండి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.
జియో పొలిటికల్ టెన్షన్స్: మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం.. అమెరికా, -వెనిజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. ఇలాంటి అనిశ్చితి సమయాల్లో ఇన్వెస్టర్లు వెండిని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తుంటారు.
