2011 WC Final: 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో యువరాజ్ కంటే ముందుగా ధోనీ బ్యాటింగ్.. కారణాలు చెప్పిన సచిన్

2011 WC Final: 2011 వరల్డ్ కప్ ఫైనల్‌లో యువరాజ్ కంటే ముందుగా ధోనీ బ్యాటింగ్.. కారణాలు చెప్పిన సచిన్

2011 ప్రపంచ కప్ ఫైనల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2011, ఏప్రిల్ 2న వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ పోరులో ధోని సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు అది ఎప్పటికీ మర్చిపోలేని మ్యాచ్. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో ధోని కొట్టిన విన్నింగ్ షాట్ ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. టోర్నీ మొత్తం విఫలమైన ధోనీ ఫైనల్లో మాత్రం చెలరేగి ఆడాడు. జట్టు క్లిష్ట పరిస్థుల్లో ఉన్నప్పుడు వచ్చి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సగటు క్రికెట్ అభిమానికి ఒక ఆలోచన మైండ్ లో ఉంటూనే ఉంటుంది.

2011 లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను గమనిస్తే యువరాజ్ సింగ్ తర్వాత ధోనీ బ్యాటింగ్ కు దిగేవాడు. ఫైనల్ ముందు వరకు ఎలాంటి మార్పు జరగలేదు. అయితే ఫైనల్లో మాత్రం మూడో వికెట్ పడిన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రావాల్సిన యువరాజ్ స్థానంలో కెప్టెన్ ధోనీ బరిలోకి దిగాడు. అప్పటివరకు బ్యాటింగ్ లో ఫామ్ లో లేని ధోనీ.. యువీ కంటే ముందుగా రావడం చూసి స్టేడియంలో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. దీని వెనుక అసలు కారణం టీమిండియా దిగ్గజం సచిన్ చెప్పుకొచ్చాడు.

సచిన్ మాట్లాడుతూ యువరాజ్ కంటే ధోనీ ముందుగా రావడానికి రెండు కారణాలను వివరించాడు. " రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి లెఫ్ట్-రైట్ కాంబినేషన్. లంక జట్టులో ఇద్దరు ఆఫ్-స్పిన్నర్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మురళీధరన్ ఆడాడు. 2011 వరల్డ్ కప్ ముందువరకు మురళీ బౌలింగ్ ను నెట్స్ లో ధోనీ మూడు సీజన్ ల పాటు ఆడాడు". అని టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా స్కోర్ 114 పరుగుల వద్ద కోహ్లీ ఔటైనప్పుడు ధోనీ క్రీజ్ లోకి వచ్చాడు. గంభీర్ తో కలిసి 109 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి వరల్డ్ కప్ ను అందించాడు.     

1983 తర్వాత భారత జట్టు గెలిచిన రెండో వన్డే ప్రపంచ కప్.. 2011. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ధోని సేన 2011 వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెన్ ఇన్ బ్లూ 48.2 ఓవర్లలో దానిని ఛేదించింది. గౌతమ్ గంభీర్ (97), ఎంఎస్ ధోని (91*) స్టార్ పెర్ఫార్మర్లు కాగా, విరాట్ కోహ్లి (35), యువరాజ్ సింగ్ (21*) భారత్ పరుగుల వేటలో సహకారం అందించారు.