Pending E-Challans: పెండింగ్ ఛలాన్లపై 50 శాతం డిస్కౌంట్.. అయితే ట్విస్ట్ ఏంటంటే..

Pending E-Challans: పెండింగ్ ఛలాన్లపై 50 శాతం డిస్కౌంట్.. అయితే ట్విస్ట్ ఏంటంటే..

బెంగళూరు: కర్ణాటకలో పెండింగ్ ఛలాన్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 12 లోపు ఛలాన్లు కట్టే వాహనదారులకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. వాహనదారులపై లీగల్ యాక్షన్ తీసుకునే వరకూ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ డిస్కౌంట్ ప్రకటించినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పెండింగ్ ఛలాన్లు చెల్లించి రాయితీలు పొందాలని వాహనదారులకు సూచించింది.

గత గురువారం ఈ ఆర్డర్ వచ్చింది. కర్ణాటక స్టేట్ పోలీస్ (KSP) యాప్ ద్వారా గానీ.. బెంగళూరు ట్రాఫిక్ డివిజన్ తీసుకొచ్చిన BTP ASTraM app ద్వారా గానీ పెండింగ్ ఛలాన్లు క్లియర్ చేసుకోవచ్చని కర్ణాటక ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. Karnataka One లేదా Bangalore One వెబ్ సైట్స్ నుంచి కూడా పెండింగ్ ఛలాన్లు కట్టొచ్చని సూచించారు.

సెప్టెంబర్ 12 తర్వాత ఈ రాయితీ ఆఫర్ ముగిసిపోతుంది. ఒక్క 2024 సంవత్సరంలోనే బెంగళూరు సిటీలో మొత్తం 80 లక్షలకు పైగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసులు నమోదు కావడం గమనార్హం. సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, స్పీడింగ్, డేంజరస్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదైనట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఈ 80 లక్షల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కేసుల్లో 50 లక్షల కేసులు ద్విచక్ర వాహనదారులవే కావడం గమనార్హం. 2023లో కూడా పెండింగ్ ఛలాన్లపై కర్ణాటకలో 50 శాతం డిస్కౌంట్ను కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. అప్పట్లో ఈ డిస్కౌంట్ ప్రకటించాక 5.6 కోట్ల రూపాయల డబ్బు ఛలాన్ల రూపంలో ప్రభుత్వానికి దక్కింది.