AUS vs IND: ఆస్ట్రేలియాతో వైట్ బాల్ సిరీస్..కెప్టెన్‌గా రోహిత్.. గిల్ స్థానంలో జైశ్వాల్

AUS vs IND: ఆస్ట్రేలియాతో వైట్ బాల్ సిరీస్..కెప్టెన్‌గా రోహిత్.. గిల్ స్థానంలో జైశ్వాల్

భారత క్రికెట్ లో గిల్ శకం మొదలైనట్టే కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన ఆసియా కప్ లో వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడంతో ఫ్యూచర్ లో అన్ని ఫార్మాట్లకు గిల్ కెప్టెన్ అని స్పష్టంగా తెలుస్తోంది.  ఓవైపు కెప్టెన్ గా, మరోవైపు బ్యాటర్ గా గిల్ అంతర్జాతీయ క్రికెట్ లో మోస్ట్ బిజీయెస్ట్ క్రికెటర్ గా మారనున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మాట్ లు ఆడుతున్న లిస్ట్ చూస్తే వారిలో ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కాగా.. మరొకరు టెస్ట్ కెప్టెన్ శుభమాన్ గిల్. అన్ని ఫార్మాట్ లు ఆడడం గిల్ పై పని భారం ఎక్కువయ్యేలా చేయడం ఖాయం. 

గిల్ బిజీ షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకొని ఈ యువ సారథిపై బీసీసీఐ పని భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 28 న ఫైనల్ మ్యాచ్ ఆడితే 29న దుబాయి నుంచి భారత జట్టు ఇండియాకు వస్తుంది. 30న అహ్మదాబాద్ చేరుకోవాల్సి ఉంది. అక్టోబర్ 1న టెస్ట్ సిరీస్ కు సిద్ధమవ్వాలి. పోనీ ఈ సిరీస్ తర్వాత ఏమైనా రెస్ట్ లభిస్తుందా అంటే మరో నాలుగు రోజుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఉంది. వస్తున్న సమాచార ప్రకారం గిల్ కు ఆస్ట్రేలియా సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వాలని భావిస్తోందట. 

గిల్ స్థానంలో ఆస్ట్రేలియా టూర్ కు ఓపెనర్ గా యశస్వి జైశ్వాల్ ను ఎంపిక చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు జైశ్వాల్ ఒకటే వన్డే మ్యాచ్ ఆడాడు. గిల్ కు రెస్ట్ ఇస్తే జైశ్వాల్ వన్డే టాలెంట్ పై కూడా ఒక క్లారిటీ వస్తోంది. 2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. 

అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాలి ఉంది. ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది. టెస్ట్, టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ బరిలోకి దిగనుండడంతో అందరి కళ్ళు వీరిపైనే ఉన్నాయి.