
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో ఇవాళ ఉదయం నుంచి వాతావరణం కూల్ కూల్గా ఉంది. ఉదయం 10 దాటిన తర్వాత కూడా సూరీడి జాడ లేదు. హైదరాబాద్లో సోమవారం ఎండలు గట్టిగానే కొట్టాయి. మంగళవారం ఉదయం నుంచి మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. హైదరాబాద్ సిటీలో మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ చేసింది. మంగళవారం సాయంత్రం లోపు హైదరాబాద్ సిటీలో వాన ఖాయమని వాతావరణ శాఖ అలర్ట్తో తేలిపోయింది.
గణేష్ పండగ సందర్భంగా సిటీలో గల్లీగల్లీలో గణేష్ను నిలబెట్టారు. ఈ టైంలో.. భారీ వర్షం కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ అంచనాలతో వినాయక మంటప నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. వర్షం పడినా మంటపానికి, గణపయ్యకు ఏం కాకుండా పక్కాగా ఏర్పాట్లు చేసినప్పటికీ కుండపోత కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోననే కంగారు మాత్రం భక్తుల్లో కనిపిస్తోంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈరోజు (ఆగస్ట్ 26, 2025) ఉదయం ఉత్తర పశ్చిమ బంగాళాఖాతం ఒడిశా తీర ప్రాంతం వద్ద బలపడి అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో తెలంగాణకు మూడు నాలుగు రోజుల పాటు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నేడు, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్ప పీడనం వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
Also read:-వినాయక పూజ ఎలా చేయాలి.. ఏఏ మంత్రాలు చదవాలి.. పూజా విధానం ఇలా..!
తెలంగాణలోని ఉత్తర తూర్పు జిల్లాల్లో నేడు(ఆగస్ట్ 26 ,2025) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐఎండీ అంచనా ప్రకారం.. ఇవాళ (ఆగస్ట్ 26, 2025) ఖమ్మం, కొమరం బీమ్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుంచి 40 కి.మీ) వీస్తాయి.