
వినాయక వ్రతం ఎలా చేయాలి... ఏయే. శ్లోకాలు చదువుతున్నప్పుడు విఘ్నేశ్వరుడికి వేటివేటితో పూజ చెయ్యాలన్నది వరుస పద్ధతిలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. . .
వినాయకుడి పూజా సామాగ్రిని వినాయకుడి దగ్గర పెట్టుకొని కూర్చోవాలి. తరువాత పూజకు కావలసిన వస్తువులను ఒక క్రమ పద్దతిలో ఉంచుకోవాలి. తరువాత ఈ క్రింద తెలిపిన విధంగా పూజ చేస్తూ పూజ ప్రారంభించాలి.
Also read:-వినాయక చవితి ముందు రోజు.. హైదరాబాద్లో క్లైమేట్ ఇలా ఉందేంటి..?
( ముందుగా పసుపు గణపతిని పూజించాలి.. )
దీపారాధన చేయాలి.. కుందిలో మూడు వత్తులు వేసి.. రెండు వత్తులను వెలిగించాలి..( తరువాత చెప్పినప్పుడు మూడో వత్తిని వెలిగించాలి)
ఓం గణానాం త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ న: శృణ్వన్నూతిభిస్సీదసాదనమ్.. శ్రీ మహాగణాధిపతయే నమ:
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేః..
ధ్యాయామి జజజధ్యానం సమర్పయామి.. ( అక్షింతలు సమర్పించాలి)
ఆవాహయామి... ఆసనం సమర్పయామి.. నవరత్న హేమ కచ్చిత సింహాసనం సమర్పయామి ( అక్షింతలు సమర్పించాలి)
పాదయో: పాద్యం సమర్పయామి.. ( పసుపు గణపతిపై నీళ్లు చల్లాలి)
హస్తేషు అర్ఝ్యం సమర్పయామి.. ( పసుపు గణపతిపై నీళ్లు చల్లాలి)
శుద్దోదక స్నానం సమర్పయామి .. ( పసుపు గణపతిపై నీళ్లు చల్లాలి)
వస్త్రం సమర్పయామి ( పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి)
యఙ్ఞోపవీతం సమర్పయామి ( పత్తితో చేసిన దారాన్ని సమర్పించాలి)
అలంకరణం సమర్పయామి ( పసుపు.. కుంకుమ.. గంధం)
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్వవికటో విఘ్నరాజోగణాధిప!
భూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్ర గజానను వక్రతుండ శూర్పకర్ణి:
హిదంట స్కందపూర్వజు పోడశైతాని నామాని యఃపవేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యమ విఘ్నస్తస్య నజాయతే
అభిప్సితార్థ సిధ్యర్థం పూజితో యసు ధైరపి! సర్వవిఘ్నచ్చిన తపై శ్రీ గణాధిపతయే నమ:
ఈ క్రింది నామాలు చదువుతూ పసుపు వినాయకుడిని పూలతో పూజించాలి
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి
ధూప మాగ్రాపయామి.. దీపం దర్శయామి ( అగర్ బత్తీలు వెలిగించాలి.. దీపానికి నమస్కరించాలి.. ఇప్పుడు మూడో వత్తి వెలిగించాలి)
నైవేద్యం సమర్పయామి( పసుపు గణపతికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి)
తాంబూలం సమర్పయామి..( తమల పాకులు.. వక్కలు.. అరటిపండ్లు)
కర్పూర నీరాజనం సమర్పయామి( పసుపుగణపతికి హారతి ఇవ్వాలి)
మంత్రపుష్పం సమర్పయామి.. పూలు.. అక్షింతలు సమర్పించాలి
ఆత్మప్రదక్షిణం సమర్పయామి..( అక్షింతలు సమర్పించాలి)
ఉద్వాసన చెబుతూ.. పసుపు గణపతిని తూర్పు దిక్కుకు కొద్దిగా జరపాలి.
హరిద్రాం గణపతి యధాస్థానం ప్రవేశయామి..!
(ఇప్పుడు మనం తెచ్చుకున్న వినాయక విగ్రహానికి పూజించాలి. విగ్రహంపై పువ్వుతో కొద్ది కొద్దిగా పంచామృతాలను చిలకరించాలి.)
శ్లో।।అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహనో ధేహి భోగమ్, జ్యో కృశ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్స్వస్తి. అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యథాస్థాన ముపహ్వయతే.
శ్లో।।స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూ జావసానకం।
తావ త్త్వం ప్రీతిభావేన బింబే స్మిన్ సన్నిధిం కురు।।
ఆవహీతోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ,
అవకుంఠితోభవ, వరదోభవ, సుప్రసన్నోభవ.. స్థిరాసనం కురు..
(గణపతి విగ్రహానికి నమస్కరించుకోవాలి)
పూజా విధానం : (కింద ఇచ్చిన శ్లోకాలను చదువుతూ, అక్షింతలు వేస్తూ దేవుడికి నమస్కరించుకోవాలి.)
ధ్యానం ...
శ్లో।।భవసంచిత పాపౌఘ - విధ్వంసన విచక్షణం।
విఘ్నాంధకార భాస్వంతం - - విఘ్నరాజమహంభజే।
ఏకదంతం శూర్పకర్ణం - గజవక్షం చతుర్భుజం।
పాశాంకుశధరం దేవం -- ధ్యాయేత్సద్ధి వినాయకం।
ఉత్తమం గణనాధస్య -- వ్రతం సంపత్కరం శుభం।
భక్తాభీష్టంప్రదం తస్మాత్ -- ధ్యాయేత్తం విఘ్ననాయకం।।
ధ్యాయేద్గజాననం దేవం -- తప్త కాంచన సన్నిభం।
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం।।
ఓం శ్రీ వరసిద్ది వినాయకాయ నమః
ధ్యాయామి, ధ్యానం సమర్పయామి.
ఆవాహనం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ అక్షింతలు వేయాలి.)
శ్లో।। అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాధనాధ సర్వజ్ఞ -- గౌరిగర్భసముద్భవ।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి.
ఆసనం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ అక్షింతలు వేయాలి.)
శ్లో।।మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నై ర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం --
ఆసనం సమర్పయామి.
అర్ఘ్యం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో విగ్రహం చేతులపై నీరు చల్లాలి.)
శ్లో।।గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షితైర్యుతం।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి.
పాద్యం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో విగ్రహం పాదాలపై నీరు చల్లాలి.)
శ్లో।।గజవక్ష నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
పాదయోః పాద్యం సమర్పయామి.
ఆచమనీయం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో నీరు చల్లాలి.)
శ్లో।।అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత।।
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయాప్రభో।।
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పత్తి, పసపు/గంధం కలిపి చేసిన మధుపర్కాన్ని దేవుడి ముందు ఉంచాలి.)
శ్లో।।దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్।
మధుపర్కం గృహాణేదం గజవక్ర నమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
మధుపర్కం సమర్పయామి. ( పత్తితో చేసిన వస్త్రాన్ని సమర్పించాలి)
పంచామృత స్నానం...
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో పంచామృతాలు చల్లాలి.)
శ్లో।। స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాధనాధ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో నీరు చల్లాలి.)
శ్లో।। గంగాది సర్వతీర్థైభ్యః ఆహృతైరమలైర్జలై:।
స్నానం కురుష్వ భగవన్నుమా పుత్ర నమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.
వస్త్రం... (కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. దూదిని పల్చగా చేసి వేయాలి.)
శ్లో।।రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం।
శుభప్రదం గృహాణత్వం, లంబోదర హరాత్మజ।।
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం
(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. దూదితో చేసిన యజ్ఞోపవీతం వేయాలి.)
శ్లో।। రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోత్తరీయకం!
గృహాణ సర్వ దేవజ్ఞ భక్తానామిష్టదాయక।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
అలంకారణార్దం.. హరిద్రాం చూర్ణిమ కుంకుమ విలేపనం సమర్పయామి.. (పసుపు.. కుంకుమ సమర్పించాలి)
గంధం...(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పువ్వుతో గంధం వేయాలి.)
శ్లో।।చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్।
విలేపనం సురశ్రేష్ఠం ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతాం।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః
దివ్య శ్రీ చందనం సమర్పయామి.
అక్షింతలు...(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. అక్షింతలు వేయాలి.)
శ్లో।।అక్షతాన్ ధవళాన్ దివ్యాన్
శాలీయాంస్తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః అలంకరణార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి.
పుష్పములు...(కింద ఇచ్చిన శ్లోకం చదువుతూ.. పూలు వేయాలి.)
శ్లో।।సుగంధాని చ సుపుష్పాణి, జాజీకుంద ముఖానిచ
ఏకవింశతి పత్రాణి సంగృహాణనమోస్తుతే।।
ఓం శ్రీ వరసిద్ధివినాయకాయ నమః పుష్పం సమర్పయామి.
అధాంగపూజ...
(కింద ఇచ్చిన నామాలు చదువుతూ పత్ర, పుష్ప, అక్షింతలు వగైరా.. నామానికి ఎదురుగా తెలిపిన చోట పూజించాలి.)
ఓం గణేశాయ నమః -పాదౌ పూజయామి (పాదములు)
ఓం ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి (మడిమలు)
ఓం శూర్పకర్ణాయ నమః- జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి (పిక్కలు)
ఓం ఆఖువాహనాయ నమః - ఊరుం పూజయామి (తొడలు)
ఓం హేరంబాయ నమః -కటిం పూజయామి (పిఱుదు)
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి (బొజ్జ)
ఓం గణనాధాయ నమః- నాభిం పూజయామి (బొడ్డు)
ఓం గణేశాయ నమః- హృదయం పూజయామి (ఛాతీ)
ఓం స్థూలకంఠాయ నమః- కంఠం పూజయామి (కంఠం)
ఓం స్కందాగ్రజాయ నమః- స్కంధౌ పూజయామి (భుజములు)
ఓం పాశహస్తాయ నమః -హగ్రౌ పూజయామి (చేతులు)
ఓం గజవక్రాయ నమః -వక్రం పూజయామి (ముఖము)
ఓం విఘ్నహంత్రే నమః- నేత్రే పూజయామి (కళ్లు)
ఓం శూర్పకర్ణాయ నమః - కర్లో పూజయామి (చెవులు)
ఓం ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి (నుదురు)
ఓం సర్వేశ్వరాయ నమః - శిరః పూజయామి (తల)
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః - సర్వాణ్యంగాని
పూజయామి (శరీరమంతటా)...అధ ఏకవింశతిపత్రపూజ (21 ఆకులతో పూజ చేయాలి.)
ఓం సుముఖాయ నమః - మాచీ పత్రం పూజయామి (మాచీపత్రి)
ఓం గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి (వాకుడాకు)
ఓం ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి (మారేడు)
ఓం గజాననాయ నమః - దుర్వారయుగ్మం పూజయామి (గరికె)
ఓం హరసూనవే నమః - దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త)
ఓం లంబోదరాయ నమః - బదరీ పత్రం పూజయామి (రేగు ఆకు)
ఓం గుహాగ్రజాయ నమః - అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి)
ఓం గజకర్ణాయ నమః - తులసీపత్రం పూజయామి (అక్షింతలు వేయాలి.. తులసి ఉన్న శాపం కారణంగా వినాయకుడికి తులసి దళములు సమర్పించకూడదు)
ఓం ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి (మామిడి ఆకు)
ఓం వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి (గన్నేరు)
ఓం భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత)
ఓం వటవే నమః - దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ)
ఓం సర్వేశ్వరాయ నమః - దేవదారు పత్రం పూజయామి (దేవదారు)
ఓం ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి (మరువము)
ఓం హేరంబాయ నమః - సింధువార పత్రం పూజయామి (వావిలి ఆకు)
ఓం శూర్పకర్ణాయ నమః - జాజీపత్రం పూజయామి (జాజి),
ఓం సురాగ్రజాయ నమ – గండకీపత్రం పూజయామి (గండకి ఆకు)
ఓం ఇభవక్రాయ నమః - శమీపత్రం పూజయామి (జమ్మి ఆకు)
ఓం వినాయకాయ నమః - అశ్వతపత్రం పూజయామి (రావి ఆకు)
ఓం సురసేవితాయ నమః - అర్జున పత్రం పూజయామి (మద్ది ఆకు)
ఓం కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి (జిల్లేడు)
ఓం శ్రీ గణేశ్వరాయ నమః - ఏకవింశతి పత్రాణి పూజయామి
(పూజ చేయగా మిగిలిన ఆకులన్నీ వేయాలి)
అష్టోత్తర శతనామావళి...
- ఓం వినాయకాయ నమః
- ఓం విఘ్నరాజాయ నమః
- ఓం గౌరీపుత్రాయ నమః
- ఓం గణేశ్వరాయ నమః
- ఓం స్కందాగ్రజాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం పూతాయ నమః
- ఓం దక్షాయ నమః
- ఓం అధ్యక్షాయ నమః
- ఓం ద్విజప్రియాయ నమః
- ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః
- ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః
- ఓం వాణీప్రదాయకాయ నమః
- ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
- ఓం శర్వతనయాయ నమః
- ఓం శర్వరీప్రియాయ నమః
- ఓం సర్వాత్మకాయ నమః
- ఓం సృష్టికర్త్రే నమః
- ఓం దేవానీకార్చితాయ నమః
- ఓం శివాయ నమః
- ఓం సిద్ధిబుద్ధిప్రదాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం బ్రహ్మచారిణే నమః
- ఓం గజాననాయ నమః
- ఓం ద్వైమాతురాయ నమః
- ఓం మునిస్తుత్యాయ నమః
- ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః
- ఓం ఏకదంతాయ నమః
- ఓం చతుర్బాహవే నమః
- ఓం చతురాయ నమః
- ఓం శక్తిసంయుతాయ నమః
- ఓం లంబోదరాయ నమః
- ఓం శూర్పకర్ణాయ నమః
- ఓం హరయే నమః
- ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః
- ఓం కావ్యాయ నమః
- ఓం గ్రహపతయే నమః
- ఓం కామినే నమః
- ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
- ఓం పాశాంకుశధరాయ నమః
- ఓం చండాయ నమః
- ఓం గుణాతీతాయ నమః
- ఓం నిరంజనాయ నమః
- ఓం అకల్మషాయ నమః
- ఓం స్వయం సిద్ధాయ నమః
- ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః
- ఓం బీజాపూరఫలాసక్తాయ నమః
- ఓం వరదాయ నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం కృతినే నమః
- ఓం ద్విజప్రియాయ నమః
- ఓం వీతభయాయ నమః
- ఓం గదినే నమః
- ఓం చక్రిణే నమః
- ఓం ఇక్షుచాపధృతే నమః
- ఓం శ్రీదాయ నమః
- ఓం అజాయ నమః
- ఓం ఉత్పలకరాయ నమః
- ఓం శ్రీపతిస్తుతిహర్షితాయ నమః
- ఓం కులాద్రిభేత్త్రే నమః
- ఓం జటిలాయ నమః
- ఓం చంద్రచూడాయ నమః
- ఓం అమరేశ్వరాయ నమః
- ఓం నాగయజ్ఞోపవీతవతే నమః
- ఓం కలికల్మషనాశనాయ నమః
- ఓం స్థులకంఠాయ నమః
- ఓం స్వయంకర్త్రే నమః
- ఓం సామఘోషప్రియాయ నమః
- ఓం పరాయ నమః
- ఓం స్థూలతుండాయ నమః
- ఓం అగ్రణ్యాయ నమః
- ఓం ధీరాయ నమః
- ఓం వాగీశాయ నమః
- ఓం సిద్ధిదాయకాయ నమః
- ఓం దూర్వాబిల్వప్రియాయ నమః
- ఓం కాంతాయ నమః
- ఓం పాపహారిణే నమః
- ఓం సమాహితాయ నమః
- ఓం ఆశ్రితశ్రీకరాయ నమః
- ఓం సౌమ్యాయ నమః
- ఓం భక్తవాంఛితదాయకాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం అచ్యుతార్చ్యాయ నమః
- ఓం కైవల్యాయ నమః
- ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
- ఓం జ్ఞానినే నమః
- ఓం దయాయుతాయ నమః
- ఓం దాంతాయ నమః
- ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః
- ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః
- ఓం వ్యక్తమూర్తయే నమః
- ఓం అమూర్తిమతే నమః
- ఓం శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసాయ నమః
- ఓం స్వలావణ్యసుధాసారజితమన్మథవిగ్రహాయ నమః
- ఓం సమస్తజగదాధారాయ నమః
- ఓం మాయినే నమః
- ఓం మూషకవాహనాయ నమః
- ఓం రమార్చితాయ నమః
- ఓం విధయే నమః
- ఓం శ్రీకంఠాయ నమః
- ఓం విబుధేశ్వరాయ నమః
- ఓం చింతామణిద్వీపపతయే నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం గజాననాయ నమః
- ఓం హృష్టాయ నమః
- ఓం తుష్టాయ నమః
- ఓం ప్రసన్నాత్మనే నమః
- ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
ధూపం...
శ్లో।। దశాంగం గగ్గులోపేతం సుగంధి సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః ధూపమాఘ్రాపయామి.
దీపం...
శ్లో।। సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా।
గృహాణమంగళం దీప మీశపుత్ర నమోస్తుతే।।
శ్రీ వరసిద్ది వినాయకాయ నమః దీపం దర్శయామి.
నైవేద్యం...
శ్లో।। సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్
నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్దెః ప్రకల్పితాన్।।
భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయ మేవచ
ఇదం గృహాణనైవేద్యం మయా దత్తం వినాయక।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః మహానైవేద్యం సమర్పయామి.
తాంబూలం...
శ్లో।। పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం!
కర్పూర చూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్।।
శ్రీ వరసిద్ది వినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి.
సువర్ణపుష్పం
శ్లో।। సచ్చిదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః సువర్ణపుష్పం సమర్పయామి.
నీరాజనం..
శ్లో।। ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తథా!
నీరాజనం మయా దత్తం గృహాణవరదో భవ।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః నీరాజనం దర్శయామి.
నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి.
దూర్వాయుగ్మ పూజ...
ఓం గణాధిపాయనమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఈశ పుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఏకదంతాయనమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం ఇభవక్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఓం కుమారగురవే నమః దూర్వాయుగ్మేన పూజయామి
(కథ చదువుకోవాలి)
పూర్వం గజరూపము గల రాక్షసేశ్వరుడు శివునిగూర్చి ఘోర తపస్సు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి 'స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించి యుండు' అని కోరినాడు. భక్తసులభుడగు ఆ మహేశ్వరుండు ఆ కోరిక తీర్చేందుకు గజాసురుని ఉదరంలోనికి ప్రవేశించి సుఖంబుండై ఉండె.
కైలాసమున పార్వతీదేవి.. భర్తజాడ తెలియక పలుతెరంగుల అన్వేషించినది. కొంత కాలమునకు గజాసురుని గర్భంలో ఉన్నట్టుగా తెలుసుకొని వెలుపలకు రప్పించుకును మార్గము తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతం తెలిపినది.'ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసగితివి.ఇప్పుడు కూడా ఏదేని ఉపాయముతో రక్షింపుమని విలపించగా, పార్వతిని హరి ఊరడించి పంపినాడు.తదుపరి హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే సరియైనదని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా అలంకరించి, బ్రహ్మాది దేవతలతో తలకొక వాయిద్యమును ధరింపచేసి, తానునూ చిరుగంటలు, సన్నాయిని దాల్చి గజాసుర పురంబు జొచ్చి, జగన్మోహనంబుగా నాడించుచుండెను. గజాసురుడు ఈ విషయము విని, వారల పిలిపించి తన భవనము ఎదుట ఆడించ నియమించెను.
బ్రహ్మాది దేవతల వాద్యవిశేషంబులు జోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు ఆ హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దునాడించగా గజాసురుడు పరమానంద భరితుడై "మీకేమి కావలయునో కోరుకొనుడు. ఇచ్చెదను" అనగా, హరి సమీపించి, "ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చెను కనుక శివునొసంగు"మని పల్కెను.
ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గుర్తించి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్తుండగు పరమేశ్వరునితో “నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి. నా చర్మమును నీవు ధరింపవలె" యని ప్రార్థించి, విష్ణుమూర్తికి అంగీకారము తెలిపెను.అంతట హరి, నందిని ప్రేరేపింప నంది తన శృంగములతో గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి వెలుపలికి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించెను. అంతట హరి "దుష్టాత్ముల కిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగునని" ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కొలు తెలిపి, తానును వైకుంఠమునకేగెను. శివుడు నందినెక్కి కైలాసంబుకు అతివేగమున బయలెల్లెను
వినాయకుడి పుట్టుక
కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలాగా వుంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.
ఇది ఇలా వుండగా, శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి, కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో వున్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి, తాను తీసుకు వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి 'గజాననుడు' అనే పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు. నెమలిని వాహనంగా ఇచ్చారు.
వినాయకాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించి, విఘ్నములకు ఒకరిని అధిపతిగా తమ కొసంగమనిరి.. గజాననుడు పొట్టివాడు కనుక ఆ ఆధిపత్యంబు తన కొసంగుమని కుమారస్వామి తండ్రిని వేడుకొనెను. "మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా వచ్చెదరో వారికే ఆధిపత్యం బొసంగుదునని" మహేశ్వరుడు పలుకగా, సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంజెక్కి వాయువేగంబున నేగె.
గజాననుండు తండ్రిని సమీపించి ప్రణమిల్లి "నా అసమర్థత తా మెరింగియు ఈ విధంగా పరీక్షించుట తగునే. మీ పాదసేవకుండనగు నా యందు కటాక్షముంచి తగు ఉపాయంబు దెల్పి రక్షింపవే" అని ప్రార్ధించెను. మహేశ్వరుండు దయాళుడై
"సకృన్నారాయణేత్ముక్త్యాపుమాన్ కల్పశతత్రయం... గంగాది సర్వతీర్దేషు స్నాతోభవతి పుత్రక ॥
కుమారా! ఒక్కసారి నారాయణమంత్రము జపించిన మాత్రమున మూడు వందల కల్పముల పుణ్య నదులలో స్నానమొనర్చిన వారవుతారు" అని తెలిపి సక్రమంబుగ మంత్రమును ఉపదేశించగా గజాననుడు ఆ మంత్రమ్ము జపించుచు కైలాసంబుననుండె.. మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడ నేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కనిపించే. ఈ విధముగనే మూడుకోట్ల ఏబది లక్షల నదులలో స్నానమాడిన తదుపరి కూడా అట్లే జరిగినది.
ఇది చూచి కుమారస్వామి, కైలాసంబునకేగి తండ్రి సమీపమందున్న గజాననునిగాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, "తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అట్లంటిని, క్షమించుము. ఈ ఆధిపత్యమ్ము అన్నగారికే యొసంగు"డని ప్రార్ధించెను.
అంతట పరమేశ్వరునిచే భాద్రపద, శుద్ధ చవితినాడు గజాననునికి ఆధిపత్యం బొసంగెను. ఆనాడు అందరూ విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, ఉండ్రాళ్లు వంటి పిండిపంటలు, టెంకాయ, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించినారు. అంతట విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కేగి, తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయి కడు శ్రమనొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు నవ్వెను.
వినాయకుని జూసి వికటంబుగా చంద్రుడు నవ్వె.అంతట "రాజదృష్టి సోకిన రాలుగూడ సుగ్గగు"నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లెను. అతండును మృతుండయ్యెను.పార్వతి శోకించుచు చంద్రుని చూచి, "పాపాత్ముడా! నీ దృష్టి దగిలి నా కుమారుడు మరణించెను గాన. నిన్ను జూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక!" అని శపించెను.
ఋషిపత్నులకు నీలాపనిందలు
ఇదే సమయమున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపజయంబున అశక్తుడై క్షీణించుచుండ... ఆ విషయము భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప తక్కిన ఋషిపత్నుల రూపమ్ములు తానే దాల్చి పతికి ప్రియంబు సేయ, ఋషులు అది జూసి, అగ్నిదేవునితోనున్నవారు తమ భార్యలేనని శంకించి, తమ తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాపనింద కలిగినది.
దేవతలు,మునులు, ఋషిపత్నులు ఆ విషయము తెలియజేయగా అతడు సర్వజ్ఞుడగుటచే అగ్ని హోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చెననే సత్యమును సప్తఋషులకు తెలియజేసి, వారిని సమాధానపరచి వారితో కూడ బ్రహ్మకైలాసమున కేతెంచి ఉమామహేశ్వరుల సేవించి, మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించిరి. అంత దేవాదులు "పార్వతీ దేవీ! నీ వొసంగిన శాపంబు లోకంబులకు కీడు వాటిల్లెను గాన దానిని ఉపసంహరింపుము" అని ప్రార్థింప, పార్వతీ కుమారుని జేరదీసి ముద్దాడి “ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో, ఆ దినంబున చంద్రుని చూడరాదు" అని శాపవసానం బొసంగె. అంత బ్రహ్మాదులు, సంతసించుచు తమ గృహములకేగి, భాద్రపద శుద్ధ చతుర్దియందు మాత్రమే చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి.
శమంతక మణోపాఖ్యానము
ద్వాపర యుగమున ద్వారకా వాసియగు శ్రీ కృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు జరుపుచు, "స్వామీ! సాయం సమయంబయ్యె. ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతి శాపంబుచే చంద్రుని జూడరాదు. కనుక నిజగృహంబున కేగెద సెలవిండు" అని పూర్వ వృత్తాంతం అంతయు శ్రీ కృష్ణునకు తెలిపి నారదుడు స్వర్గలోకమున కేగె. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణంబున చాటించెను.
శ్రీ కృష్ణుడు క్షీరప్రియుడగుటచే నాటి రాత్రి మింటివంక చూడకయే గోశాలకు బోయి పాలుపిదుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి "ఆహా! ఇక నాకెట్టి యపనింద రానున్నదో" అని సంశయమున ఉండెను. కొన్నాళ్ళకు యదువంశరాజు సత్రాజిత్తు సూర్యుని ఉపాసించి శమంతకమనే పేరుగల మణిని సంపాదించి, ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవ, శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజున కిమ్మని అడిగెను. కానీ, "ఎనిమిది బారువుల బంగారమును దినంబున కొసంగు ఈ మణిని ఏ ఆప్తునికైనను ఏ మందమతియైనకు ఇవ్వండ"నిన పొమ్మని యూరకుండెను.
అంత నొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడా శమంతకమును కంఠమున ధరించి వేటాడ అడవికి బోవ ఒక సింహమా శమంతకమణిని మాంసఖండమని భ్రమించి వానినిజంపి ఆ మణింగాని పోవచుండ ఒక భల్లూకం ఆ సింహమును దునిమి యా మణింగొని తన కొండ బిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెయగు జాంబవతికి ఆట వస్తువుగా ఒసంగెను. మరునాడు సత్రాజిత్తు, తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదన్న కారణమ్ముగా నా సోదరుని జంపి రత్న మపహరించెనని పట్టణమున జాటె..అది కృష్ణుడు విని "నాడు క్షీరమున చంద్రబింబమును జూచిన దోష ఫలంబ"ని యెంచి దానిని బాపుకొన బంధుసమేతుడై అరణ్యమునకు బోయి వెదకగా ఒక్కచోట ప్రసేన కళేబరంబును, సింగపు కాలిజాడలను, పిదప భల్లూక చరణవిన్యాసంబును కాన్పించెను. ఆ దారిని బట్టి పోవచుండ నొక పర్వత గుహ ద్వారంబు జూసి, పరివారము అచట విడిచి కృష్ణుడు గుహలోపలికేగి, అచట బాలిక ఊయలపై కట్టబడియున్న మణినిజూసి, దానియొద్దకు పోయి ఆ మణిని చేత బుచ్చుకొని వచ్చుచున్నంత ఊయలలోని బాలిక ఏడ్వదొడంగెను. అంతట ఆదియును వింతమానిసి వచ్చెననుచు కేకలు వేసెను.
అంతట జాంబవంతుడు కోపావేశుండై శ్రీకృష్ణునిపై బడి అరచుచు, నఖంబులతో గ్రుచ్చుచు, కోరలతో కొరుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుండును.వానినిబడద్రోసి వృక్షముల చేతను రాళ్ళ చేతను, తుదకు ముష్టిఘాతములచేతను రాత్రింబవళ్ళు యిరువది ఎనిమిది దినంబులు యుద్ధమొనర్ప జాంబవంతుడు క్షీణబలుడై, దేహంబెల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింప జేసిన పురుషుడు రావణసంహారి యగు శ్రీరామచంద్రునిగా దలచి అంజలి ఘటించి, "దేవా! భక్తజన రక్షకా! త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామ చంద్రునిగా నిన్ను నేను నెఱంగితి. ఆ కాలం బున నాయందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొమ్మని ఆజ్ఞ యొసంగ, నా బుద్ధిమాంద్యంబున మీతో ద్వంద్వ యుద్ధము జేయవలెనని కోరుకొంటిని.కాలాంతరమున ఆది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణచేయుచు అనేక సంవత్సరములు గడుపుచు ఉండ ఇప్పుడు తాము నా నివాసము నకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి.
నాశరీర మంతయు శిధిలమయ్యె. ప్రాణములు కడబట్టే, జీవితేచ్చ నశించె. నన్ను క్షమించి కాపాడుము. నీకన్న వేరు దిక్కులేరు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబుచే నిమిరి "భల్లూకేశ్వరా! శమంతకమణి నొసంగుము నేనేగెద" అని తెలుప అతడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా నొసంగె.మణితో శ్రీకృష్ణుడు పురంబు జేరి సత్రాజిత్తును రావించి, యా వృత్తాంతమును జెప్పి శమంతకమణి యొసంగ ఆ సత్రాజిత్తు "అయ్యో లేని పోని నింద మోపి దోషంబునకు బాల్పడితిని" అని విచారించి మణి సహితముగా తన కూతురగు సత్యభామను గైకొమ్మనిన, మణి వలదని మరల నొసంగెను.
అంత కృష్ణుడు దయాళుడై, "భాద్రపద శుద్ధ చతుర్ధిని గణపతిని యధావిధి పూజించి, ఈ శమంతకమణి కథను విని, అక్షింతలు శిరంబున దాల్చువారికి ఆనాడు ప్రమాదంబున చంద్రదర్శనమగుటచే వచ్చు నీలాపనిందలు పొందకుండుగాక!"యని ఆనతీయ దేవతలు సంతసించి తమ నివాసంబుల కేగి. ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్ధియందు గణపతిని పూజించి అభీష్టసిద్ధిగాంచుచు సుఖంబుగా నుండి"రని శౌనకాది మునులకు, ధర్మరాజునకు సూతుడు వినిపించెను.
కాబట్టి అందరూ కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక జయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని చేసి, దమయంతి నలుని, శ్రీ కృష్ణుడు జాంబవతిని, శమంతకమణిని పొందారు. ఇంద్రుడు వృత్రాసురుని సంహరించాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. భగీరథుడు గంగకోసం, దేవాసురులు అమృతాన్ని పుట్టించడానికి వ్రతాన్ని ఆచరించారు.
గజాననుడు జన్మించినది భాద్రపద శుద్ధ చతుర్థి, గణా ధిపతి అయినది కూడా అదేరోజు, అందుకే భాద్రపద శుద్ధ చతుర్థినాడు నాలుగు వర్ణాలవారు, స్త్రీలు పిల్లలూ అందరూ ఈ వ్రతాన్ని యధావిధిగా చేసికొని తమ తమ కోరికలను నెరవేర్చుకొనగలరని పురాణాల్లో ఉంది.
సర్వేజనా స్సుఖినో భవంతు! ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
మంత్రపుష్పం...
శ్లో।। గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన!
వినాయకేశతనయ సర్వసిద్ధిప్రదాయక।।
ఏకదంతైక వదన తథా మూషికవాహన!
కుమారగురవే తుభ్య మర్పయామి సుమాంజలిమ్।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః మంత్రపుష్పం సమర్పయామి.
ఆత్మ ప్రదక్షిణం...
శ్లో।। ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ!
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన।।
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాం సమర్పయామి
పునరర్ఘ్యం...
శ్లో।।అర్ఘం గృహాణహేరంబ సర్వభద్ర ప్రదాయక
గంధపుష్పాక్షతై ర్యుక్తం పాత్రస్థం పాపనాశన!
శ్రీ వరసిద్ధివినాయకాయ నమః పునరర్ఘ్యం సమర్పయామి.
ప్రార్థన...(ఈ శ్లోకం చదువుతూ.. వినాయకుడికి ప్రార్థన చేయాలి.)
శ్లో।। నమ స్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన!
ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్।।
వినాయక నమ స్తుభ్యం సతతం మోదక ప్రియ!
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా।।
ప్రదక్షిణం...
శ్లో।। యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ! తాని తాని ప్రణశ్యంతి...ప్రదక్షిణ పదే పదే।। పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల।। అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మా త్కారుణ్యభావేన రక్ష రక్ష వినాయక।।
దీంతో పూజా విధానం సంపూర్ణం...
ఉద్వాసనమ్...
శ్లో।। యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమా న్యాసన్, తేహ నాకం మహిమాన స్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః ఈ శ్లోకం చదివి వినాయకుడిని ఈశాన్య దిశగా కదల్చాలి.