ఆదివాసీల చరిత్ర అంటేనే పోరాటం: మంత్రి సీతక్క

ఆదివాసీల చరిత్ర అంటేనే పోరాటం: మంత్రి సీతక్క

భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట/దమ్మపేట, వెలుగు: కుమరంభీం​‘జల్, జంగిల్, జమీన్’​ పోరాటమే.. తెలంగాణ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదానికి మూలమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆమె పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆదివాసీ ర్యాలీలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పాల్గొన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో తొమ్మిది ఆదివాసీ సంఘాల జేఏసీ, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. బ్రిటీషర్లను తరిమి కొట్టడంతో పాటు స్వయం పాలన కోసం చేసిన పోరాటంలో ఆదివాసీలు కీలకపాత్ర పోషించారన్నారు. దేశంలో అత్యధికంగా ప్రాణ త్యాగాలు చేసింది ఆదివాసీలేనన్నారు. సమక్క, సారలమ్మ స్వయం పాలన కోసం పోరాడారని గుర్తు చేశారు.

ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం కోసం కుమురంభీం చేసిన పోరాటాల స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివాసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని, ఆదివాసీలకు దక్కాల్సిన హక్కుల కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. అంబేద్కర్, నెహ్రూ ఆదివాసీల సంక్షేమంలో భాగంగానే 5,6 షెడ్యూళ్లను రాజ్యాంగంలో పొందుపర్చారని గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు వస్తున్నా ఆదివాసీలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు.

ఛత్తీస్​గఢ్​లో పెద్ద ఎత్తున మైనింగ్​ జరుగుతున్నా, అక్కడ మైనింగ్​కు ఆదివాసీలు ఓనర్లు కావడం లేదన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆదివాసీలు వెనుకబడి ఉన్నారన్నారని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్,​ కూనంనేని సాంబశివరావు, నేతలు చుంచు రామకృష్ణ, మహిపతి అరుణ్​కుమార్, కొడెం వెంకటేశ్వర్లు, వాసం రామకృష్ణ పాల్గొన్నారు.