పాలనా వైఫల్యాలే ప్రతిపక్షానికి బలం : ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ

పాలనా వైఫల్యాలే ప్రతిపక్షానికి బలం : ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ
  •     ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు మెండు
  •     తెలంగాణ భవన్​లో ఉగాది పంచాంగ శ్రవణంలో పండితులు
  •     విద్యావిధానంలో మార్పులతో విద్యార్థులకు నష్టం
  •     ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే నిరుద్యోగం పెరిగే అవకాశం
  •     ఈ ఏడాది రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పరాభవ నామ సంవత్సరంలో ప్రభుత్వంలోని లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని ప్రముఖ పండితులు మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పేర్కొన్నారు. గురువారం తెలంగాణభవన్​లో ఉగాది వేడుకలు నిర్వహించారు. బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్ ​తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైతే ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఏర్పడుతాయన్నారు. విద్యా విధానంలో మార్పులు విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పట్టే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 

అంతర్జాతీయంగా విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొంటారని, అయితే ఇరుగుపొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటుచేసుకునే అవకాశముందని పేర్కొన్నారు.  ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని, చెరువులు, జలాశయాలు నిండిపోతాయని తెలిపారు. ధాన్యం, పత్తి, మక్క వంటి పంటలు బాగా పండే అవకాశం ఉందని, రైతుల ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయని చెప్పారు. అయితే బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని, కూరగాయల ధరలు కొంతవరకు తగ్గవచ్చని తెలిపారు. 

విడాకులు తగ్గుతయ్​

అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశముందని పేర్కొన్నారు. పశుసంపద అభివృద్ధి గణనీయంగా ఉంటుందని పండితులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా మరింత గౌరవాన్ని పొందుతుందని, వాణిజ్య రంగంలో దేశం రాణిస్తుందని పండితులు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, మానవతా విలువలు పెరుగుతాయని, విడాకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉన్నత పదవుల్లో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉందని తెలిపారు. 

కొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని సమర్థంగా ఎదుర్కొనే అవకాశముందని చెప్పారు. పంజాబ్ లో ప్రకృతి ప్రకోపాలు ఉండే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రైలు, విమాన, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, సినీ, రాజకీయ రంగాలకు చెందిన కొంతమంది ప్రముఖులు కనుమరుగయ్యే అవకాశముందని కూడా తెలిపారు. ప్రజలు మానసికంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితులు ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ప్రభావం దేశంపై పెద్దగా ఉండదని పండితులు వెల్లడించారు.