తెలంగాణ ప్రజల సొమ్ము దేశమంతా ఫలహారం..దశాబ్ది వేడుకల పబ్లిసిటీకి రూ.300 కోట్లు

తెలంగాణ ప్రజల సొమ్ము దేశమంతా ఫలహారం..దశాబ్ది వేడుకల పబ్లిసిటీకి రూ.300 కోట్లు
  • ఉద్యమాన్ని అవమానించిన ఆంధ్రా మీడియాకు దండిగా యాడ్స్​
  • అవతరణ శుభాకాంక్షలన్నా తెలుపని పేపర్లకు ప్రకటనలే ప్రకటనలు
  • మరాఠీ, హిందీ, కన్నడ, తమిళ్, ఒరియా​.. ఇట్ల అన్ని భాషల్లో ప్రచారం
  • దశాబ్ది వేడుకల పేరుతో మీడియాలో పబ్లిసిటీకి రూ.300 కోట్లు ఖర్చు
  • తెలంగాణ మీడియా సంస్థలపై మాత్రం అదే బహిష్కరణ అస్త్రం 


హైదరాబాద్​, వెలుగు: తమకు నచ్చినోళ్లకు.. తమకు అక్కరకు వచ్చినోళ్లకు ప్రజాధనాన్ని పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గేట్లు తెరిచింది. అప్పుడు తెలంగాణ జనాన్ని అవమానించి, తెలంగాణ ఉద్యమంపై కుట్రలు పన్ని, ఎందరో ఉద్యమకారుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆంధ్రా మీడియాకు రాష్ట్ర  ప్రభుత్వం మరోసారి వందల కోట్లు పంచిపెట్టింది. తెలంగాణ పదేండ్ల పండుగ పేరుతో సొంత ప్రచారానికి రాష్ట్ర ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు పెట్టింది. ఐ అండ్​ పీఆర్​ విభాగం నుంచి  ఒక్కో పేపర్​లో 12 ఫుల్​ పేజీల అడ్వర్టయిజ్​మెంట్లను ఇచ్చేసింది. ఒక్క మన రాష్ట్రమే కాకుండా  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పబ్లిసిటీకి పోటీ పడింది. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్​ ఫొటో కనిపించేలా పేజీలకొద్దీ పొగడ్తలతో ముంచెత్తింది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్​, తమిళ్, కన్నడ, మరాఠీ, పంజాబీ, ఒరియా పత్రికల్లోనూ తెలంగాణ అవతరణ వేడుకల పేరుతో దండిగా యాడ్స్​ కుమ్మరించింది. శుక్రవారం ఒక్కరోజే మీడియాలో పబ్లిసిటీకి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు పెట్టింది. జనం గొంతుకగా, జనం సమస్యలను చెప్పే తెలంగాణ మీడియా సంస్థలపై మాత్రం కక్షను యథాతథంగా కొనసాగించింది.

ప్రభుత్వ లోపాలను వేలెత్తి చూపుతున్నదని, ప్రజల తరఫున  ప్రశ్నిస్తున్నదనే కారణంతో వీ6, వెలుగును పార్టీ కార్యక్రమాలకు నిషేధించిన బీఆర్​ఎస్​..  ప్రభుత్వ ప్రకటనల విషయంలోనూ అదే బ్యాన్​ను కొనసాగిస్తున్నది. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చులకన చేసిన మీడియాను ఇప్పుడు సంకనెత్తుకుంది. ఇబ్బడిముబ్బడిగా కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు గుప్పించింది. కనీసం తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేందుకు కూడా ఇష్టపడని మీడియా సంస్థలకు కోట్లకు కోట్లు పంచిపెట్టి.. పరోక్షంగా ఇక్కడి ప్రజలను అవమానించింది. రాష్ట్ర ప్రభుత్వం పగబట్టినా సరే.. ‘వీ6, వెలుగు’ మీడియా ఒక్కటే జనం పక్షాన అవతరణ వేడుకలకు జేజేలు పలికింది. నాలుగు కోట్ల ప్రజలకు పేరుపేరునా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. ఉద్యమంలో అమరులైన ప్రతి వీరుడికి నివాళులు అర్పించింది. అప్పటి పోరాటంలో నిలబడి కలబడి కొట్లాడిన ఉద్యమ నేతలందరినీ  పేరుపేరునా.. యాదికి తెచ్చుకుంది.