కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో బుధవారం ( డిసెంబర్ 31 )సాయంత్రం టీటీడీ చైర్మెన్ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ ప్రాంగణం, లడ్డూ కౌంటర్ల దగ్గర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టీటీడీ కల్పిస్తున్న ఏర్పాట్లపై భక్తులతో స్వయంగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు బీఆర్ నాయుడు. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటికి వచ్చిన భక్తులు టీటీడీ ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు భక్తులు.
అనంతరం లడ్డూ కౌంటర్ దగ్గరికి చేరుకున్న చైర్మన్ లడ్డూ విక్రయాలు, సిబ్బంది పనితీరును పరిశీలించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని, కావాల్సినన్ని లడ్డూలు దొరుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు భక్తులు.
ఈ సందర్భంగా అధికారులు వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా రోజుకు 4 లక్షల 80 వేల లడ్డూలను తయారు చేస్తున్నట్లు చైర్మన్ కు వివరించారు. అన్ని కౌంటర్లు తెరిచి ఉంచి ఎలాంటి జాప్యం లేకుండా భక్తులకు లడ్డూలు విక్రయించాలని అధికారులను ఆదేశించారు చైర్మన్ బీఆర్ నాయుడు.
