వైకుంఠ ఏకాదశి ఎఫెక్ట్: తిరుమలలో ఫుల్ ట్రాఫిక్ జామ్.. రెండు కిలోమీటర్ల మేర ఎక్కడ వాహనాలు అక్కడే !

వైకుంఠ ఏకాదశి ఎఫెక్ట్: తిరుమలలో ఫుల్ ట్రాఫిక్ జామ్.. రెండు కిలోమీటర్ల మేర ఎక్కడ వాహనాలు అక్కడే !

తిరుపతి: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించడంతో వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు మంగళవారం తిరుమలకు చేరుకున్నారు. దీంతో.. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్లో రెండు కిలోమీటర్ల మేర ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. వీఐపీలు ఒక్కసారిగా తిరుగు ప్రయాణం కావడంతో ట్రాఫిక్ ఆగిపోయింది. మోకాళ్ళ పర్వతం నుంచి వాహనాలు భారీగా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు, చిన్నారుల అవస్థ వర్ణనాతీతం. 

మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాధారణ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. ఈ ప్రత్యేక దర్శనం మొత్తం పది రోజుల పాటు కొనసాగనుంది. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి.

భక్తుల సౌకర్యార్థం మొదటి మూడు రోజులు, అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో, ముందుగా టోకెన్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ టోకెన్లను టీటీడీ ముందుగానే కేటాయించింది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు మరియు టోకెన్ ప్రింట్ కాపీ తీసుకురావాల్సి ఉంటుంది. 

వైకుంఠ ఏకాదశి రోజున మంగళవారం ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా అలంకరించిన స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం బుధవారం ద్వాదశి పండుగ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ఇది అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు.