2026లో ఏఐ వల్ల ప్రమాదంలో ఉన్న జాబ్స్ లిస్ట్ ఇదే.. మైక్రోసాఫ్ట్ సంచలన నివేదిక

2026లో ఏఐ వల్ల ప్రమాదంలో ఉన్న జాబ్స్ లిస్ట్ ఇదే.. మైక్రోసాఫ్ట్ సంచలన నివేదిక

కొత్త ఏడాది వేడుకలు ముగించుకుని తిరిగి రొటీన్ జాబ్ లైఫ్ లోకి వెళ్లే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక నిశ్శబ్ద విప్లవం దాని పని అది చేసుకుపోతూనే ఉందే. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో ఏఐ మన పనులను సులభతరం చేస్తుందా లేక మన ఉద్యోగాలనే లాగేసుకుంటుందా? అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముదురుతోంది. ఆధునిక ఏఐ పితామహుడిగా పిలవబడే జెఫ్రీ హింటన్ మొదలుకొని, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వరకు అందరూ ఒకే విషయాన్ని హెచ్చరిస్తున్నారు.. అదే ఏఐ వల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగ రంగంలో భారీ మార్పులు తప్పవని.

ఈ అంచనాలను నిజం చేస్తూ మైక్రోసాఫ్ట్ తన 'కోపైలట్' టూల్ ద్వారా సుమారు 2 లక్షల మంది ఉద్యోగుల పనితీరును విశ్లేషించింది. ఈ అధ్యయనంలో భాగంగా ఈమెయిల్స్ రాయడం, మీటింగ్స్ సారాంశం సిద్ధం చేయటం, రిపోర్టులు తయారు చేయడం వంటి పనుల్లో ఏఐ ఎంతవరకు ప్రభావం చూపుతుందో పరిశీలించారు. దీని ఆధారంగా 40 రకాల ఉద్యోగాలకు ఏఐ వల్ల ముప్పు పొంచి ఉందని మైక్రోసాఫ్ట్ తేల్చింది. 

2026లో ఏఐ వల్ల ప్రమాదంలో ఉన్న జాబ్స్ లిస్ట్:

1. కంటెంట్ రైటర్స్ అండ్ ఎడిటర్లు (Writers & Editors)
2. ట్రాన్స్ లేటర్స్ (Translators & Interpreters)
3. న్యూస్ అనలిస్టులు, జర్నలిస్టులు
4. డేటా సైంటిస్టులు
5. మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు
6. వెబ్ డెవలపర్లు 
7. కోడర్లు 
8. గణిత శాస్త్రవేత్తలు (Mathematicians)
9. కస్టమర్ సర్వీస్ ప్రతినిధులు
10. పి.ఆర్ స్పెషలిస్టులు (PR Specialists)
11. టెలిమార్కెటర్లు
12. టెలిఫోన్ ఆపరేటర్లు
13. టికెట్ ఏజెంట్లు
14. ట్రావెల్ ప్లానర్లు
15. చరిత్రకారులు 
16. పొలిటికల్ సైంటిస్టులు

అయితే ఈ ఉద్యోగాలు పూర్తిగా మాయమైపోతాయని దీని అర్థం కాదు. కానీ ఈ జాబ్స్ చేస్తున్న వారి రోజువారీ పనులు మారిపోతాయి. ఉదాహరణకు.. ఒక వెబ్ డెవలపర్ గంటల తరబడి రాసే కోడ్‌ను ఏఐ సెకన్లలో ఇచ్చేస్తుంది. అలాగే రిపోర్టుల విశ్లేషణను ఏఐ సులభతరం చేస్తుంది. ఇక్కడ మనిషి చేయాల్సింది ఏంటంటే.. ఏఐ చేసే యాంత్రికమైన పనులను దానికి వదిలేసి, క్రియేటివిటీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వ్యూహాత్మక నిర్ణయాల మీద దృష్టి పెట్టడం మాత్రమే. అంటే ఇకపై అదే పనిని ఉద్యోగి మరింత వైవిద్యంగా ఏఐని సహాయంగా వాడుకుంటూ చేయాల్సి ఉంటుందని అర్థం.

2026లో నిలబడాలంటే ఏఐతో పోటీ పడటం కాకుండా.. ఏఐని ఒక సహచరుడిగా వాడుకోవడం నేర్చుకోవాలి. పైన చెప్పిన లిస్టులో మీరు చేస్తున్న ఉద్యోగం ఉందని భయపడటం కంటే.. మీరు స్కిల్స్ ఎంతవరకు అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారనేదే ముఖ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎదిగే కెరీర్లు నిలబడతాయి, మొండిగా పాత పద్ధతుల్లోనే ఉండేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం ఉన్న టెక్ ప్రపంచంలో ఏఐ అనేది మనం కోరుకోని సహోద్యోగి కావొచ్చు, కానీ దానితో కలిసి పనిచేయడం నేర్చుకోవడమే మన ముందున్న ఏకైక మార్గం అని గమనించటంలోనే విజయం దాగి ఉంటుంది. మెుత్తానికి ఏఐతో పోటీ వద్దు.. స్నేహం ముద్దు అని గుర్తించి కొత్త ఏడాదిలో ఉద్యోగులు ముందుకు సాగటం మంచిది.