అడ్డదారుల్లో భారీగా సంపాదిస్తున్న వైన్ షాపుల ఓనర్లు 

అడ్డదారుల్లో భారీగా సంపాదిస్తున్న వైన్ షాపుల ఓనర్లు 
  • బ్రాండ్​ బాటిళ్ల మూత తీసి మరో సీసాలో లిక్కర్​ పోసి మాయాజాలం
  • అడ్డదారుల్లో భారీగా సంపాదిస్తున్న ఓనర్లు 
  • సిండికేట్​గా మారి ఇష్టారాజ్యంగా అమ్మకాలు
  • యజమానులతో అధికారుల కుమ్మక్కు
  • ఆబ్కారీ సోదాల్లో బట్టబయలు

హైదరాబాద్, వెలుగు : వైన్ దుకాణాల్లో అమ్మే మద్యం చాలా ప్రాంతాల్లో కల్తీ అవుతున్నది. కొన్ని షాపుల యజమానులు అక్రమాల బాటపడుతూ భారీగా సంపాదిస్తున్నారు. కస్టమర్లకు క్వాలిటీ సరుకు అందకుండా చేస్తున్నారు. కొన్ని చోట్ల వైన్స్ దుకాణాల ఓనర్లు సిండికేట్​గా మారి ఇష్టమొచ్చినట్లు సేల్స్​ చేస్తున్నారు. తామేం తక్కువ కాదన్నట్లు ఆబ్కారీ అధికారులు వారితో కుమ్మక్కైనట్టు తెలుస్తున్నది. ఆబ్కారీ శాఖ బృందాలు జరిపిన ఆకస్మిక సోదాల్లో ఈ అక్రమాలన్నీ బయటపడ్డాయి. కల్తీకి పాల్పడ్డ దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసిన అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సోదాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని ఆఫీసర్ల అండదండలతో చడీచప్పుడు లేకుండా దందా సాగిస్తున్న వైన్స్ ఓనర్లు.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ ల సడెన్​ రెయిడ్లతో ఉక్కిరిబిక్కిరయ్యారు. హైదరాబాద్ నారాయణగూడలోని రెండు వైన్స్​షాపుల్లో మద్యం కల్తీ వ్యవహారాన్ని అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు. స్టేషన్ హౌస్​ ఆఫీసర్ షాపుల ఓనర్లతో కుమ్మక్కై సర్కారీ ఆదాయానికి గండి కొట్టేలా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. మద్యం కల్తీ దందా జోరుగా సాగుతున్నందున స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ఆబ్కారీ శాఖ బృందాలు నేరుగా వైన్స్ షాపులపై ఆకస్మిక సోదాలకు దిగుతున్నాయి. జీహెచ్ఎంసీ తరహాలోనే మిగతా జిల్లాల్లోనూ ప్రతి 15 రోజులకోసారి సోదాలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
 
ఇక అన్ని జిల్లాల్లో సోదాలు
ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధి (హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్) లోని 691 వైన్సులపై ఆబ్కారీ టీమ్ లు ఒక్కరోజులోనే మూకుమ్మడి సోదాలకు దిగాయి. నలుగురు సభ్యులతో కూడిన టీమ్ ప్రతి వైన్స్ షాపును క్షుణ్నంగా పరిశీలించింది. సాధారణంగా ఏ జిల్లా అధికారులు ఆ జిల్లా పరిధిలోనే  సోదాలు చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఈసారి ఇతర జిల్లాల టీమ్ లు తనిఖీలు చేశాయి. స్థానిక అధికారులు వైన్స్​ దుకాణాల ఓనర్లతో కుమ్మక్కవడాన్ని గుర్తించి బయటి టీమ్ లను రప్పించారు. కానిస్టేబుల్ నుంచి జిల్లా అధికారి దాకా ఒక్కొక్కరికి ఇంత అంటూ మామూళ్లు అందడం సాధారణమే అయినా ఈమధ్య  అక్రమ మార్గాల వల్ల సర్కారు ఆదాయానికి గండి పడుతున్నది. ఆబ్కారీ పాలసీ ప్రకారం పెద్ద సిటీల్లో వైన్స్ కు ఎక్సైజ్ డ్యూటీ సంవత్సరానికి రూ.1.10 కోట్లు. దానికి 10 రెట్ల లిక్కర్ అమ్మే వరకు 20 శాతం కమీషన్ వస్తుంటుంది. అంటే రూ.11 కోట్ల విలువైన లిక్కర్ అమ్మిన తర్వాత జరిపే సేల్స్ పై 10 శాతం మాత్రమే కమీషన్ అందుతుంది. 

అక్రమార్కుల్లో టెన్షన్​
అధికారుల ఆకస్మిక దాడులతో వైన్స్​ షాపుల ఓనర్లలో టెన్షన్​ మొదలైంది. ఇప్పటిదాకా లోకల్ ఆఫీసర్లను ఏదోరకంగా మేనేజ్ చేస్తూ దండిగా సంపాదిస్తున్నామని అనుకుంటున్న తరుణంలో ఈ తరహా దాడులు జరగడంతో  అక్రమార్కులు బెంబేలెత్తుతున్నారు. 

అన్నిచోట్ల తనిఖీలు చేస్తాం:  సర్ఫరాజ్ అహ్మద్, కమిషనర్, ఆబ్కారీ శాఖ
ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగిన తని ఖీలు అన్ని జిల్లాల్లో ఉంటాయి. కొన్ని వైన్స్​లో మద్యం కల్తీ అయిన విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. కొందరిపై కేసులు నమోదు చేశాం. ఫైన్ కూడా విధించే ఆలోచనలో ఉన్నాం. తీవ్రతను బట్టి లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనుకాడం.

రాత్రి 10 తర్వాత కల్తీ దందా
దుకాణాల్లో అమ్మే సరుకు నాణ్యమైనదని మద్యం ప్రియులు నమ్ముతారు. అందుకే సమీపంలో బెల్టు షాపులు ఉన్నా వైన్స్ షాపుల్లోనే మందు కొనుక్కోవాలని చూస్తారు. కానీ అక్కడ మద్యం కల్తీ అవుతున్న విషయం ఎవరికీ అర్థం కాదు. కొన్ని బ్రాండ్ల సీళ్లు విప్పి అందులోని లిక్కర్ ను మరో బాటిల్ లో పోసి మిగతా సగం నీళ్లు నింపుతుంటారు. ఇందు కోసం కొన్ని వైన్సులకు ఒక టీమ్ పనిచేస్తుంటుంది. జిల్లాల్లో రాత్రి 10 తర్వాత, హైదరాబాద్ లో  11 గంటలకు దుకాణాలను మూసిన వెంటనే కల్తీ దందాకు దిగుతున్నారు. సీసాకున్న మూతను సీల్ పోకుండా ఒక్కసారిగా బయటకు తీసి మళ్లీ యథావిధిగా దాన్ని అమర్చుతున్నారు. ఇలా చేసినందుకు ఈ టీమ్ సభ్యులకు తలా ఇంత అని ముట్టజెపుతున్నారు. మరోవైపు కొన్ని జిల్లాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ సరుకు వస్తున్నదని అధికారులు గుర్తించారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వల్ల భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తున్నది. అందుకే సరిహద్దు ప్రాంతాలు, జిల్లాలపై నిఘా పెట్టారు.