ఇష్టానుసారంగా ఆరోపణలు చేసే ప్రతిపక్షాలకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం.. చట్టపరమైన చర్యలు తప్పవు. దమ్ముంటే మీ ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ విసిరారు. ములుగులో పోషణ పక్వాడ సందడి కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
గత ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల పరిస్థితి అత్యంత దయనీయమన్నారు సీతక్క. కరెంటు లేదు, తాగునీరు లేదు, కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,500 అంగన్‌వాడీలకు భవనాలే లేకపోయినా నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు.కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పు మొదలైందదన్నారు. ఇప్పటికే రెండు వేల కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పారు. కేవలం పౌష్టికాహారం అందించడమే కాదు.. అంగన్‌వాడీలను సకల సౌకర్యాలతో 'ప్రీ-ప్రైమరీ స్కూల్స్'గా తీర్చిదిద్దుతుంటే.. అది ఓర్వలేక కొన్ని పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు సీతక్క.
►ALSO READ | సంస్కరణలతోనే సామాజిక ప్రగతి : టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టా రెడ్డి
ఇక సెల్ ఫోన్ల కొనుగోలుపై క్లారిటీ ఇస్తూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఐదుగురు నిపుణులైన అధికారుల కమిటీ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా టెండర్లు నిర్వహించామని స్పష్టం చేశారు. విమర్శలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీతక్క చెప్పారు.
