బాస్మతి బియ్యంలో కల్తీ.. వాసన,రుచి వచ్చినంత మాత్రాన..!

బాస్మతి బియ్యంలో కల్తీ.. వాసన,రుచి వచ్చినంత మాత్రాన..!

బాస్మతి బియ్యానికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైస్.. ఇలా రైస్ ఐటం ఏదైనా సరే బాస్మతీ బియ్యంతో వండాల్సిందే. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక బాస్మతి బియ్యానికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు కల్తీ, నాసిరకం బాస్మతి బియ్యాన్ని వాడుతున్నారు. ఈ కల్తీ మాఫియాని అరికట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బియ్యం పొడవు, రుచి తదితర అంశాలపై నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది. 

వండుతున్నప్పుడు బాస్మతీ బియ్యం సువాసన వచ్చినంత మాత్రాన అది బాస్మతి బియ్యం కాదు. కేవలం వాసనను బట్టి బియ్యం కొనుగోలు చేయొద్దని సైంటిస్టులు చెప్తున్నారు. స్థానిక మార్కెట్‌లలో బాస్మతీ బియ్యాన్ని ఎక్కువగా కల్తీ చేస్తున్నారు. అందుకే.. చవకగా దొరుకుతుంది కదా అని ఏ రైస్ పడితే ఆ రైస్ కొనుగోలు చేయొద్దు అంటోంది మీరట్‌లోని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ.  ఈ విషయాలన్నీ మీరట్ బాస్మతి ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కల్తీ చేయడం వల్ల అసలైన బాస్మతి బియ్యం వాసన, రుచి కోల్పోతున్నారని వెల్లడించింది. లోకల్ గా దొరుకుతున్న 495 రకాల బాస్మతి బియ్యాన్ని పరీక్షించిన సైంటిస్ట్ లు అందులో 50 శాతం వరకు కల్తీ జరుగుతుందని గుర్తించారు.

దీంతో.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రమాణాలు దేశీయ మార్కెట్ తో పాటు విదేశీ ఎగుమతులకు కూడా వర్తిస్తాయని తెలిపింది. బాస్మతీ బియ్యానికి ఆర్టిఫిషియల్ కలర్స్, వాసన, పాలిషింగ్ ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పాటు ధాన్యం పరిమాణం సహజంగా 7 మిల్లీ మీటర్, వండిన తర్వాత పొడవు 12 మిల్లీ మీటర్ ఉండాలని సూచించింది. ఈ కొత్త రూల్స్ ను ఆగస్టు 1, 2023 నుంచి అమల్లోకి రానున్నాయి.