హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సంచలన సృష్టించిన అడ్వకేట్ మెయిజుద్దీన్ మర్డర్ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం (మే 29) అడ్వకేట్ మెయిజుద్దీన్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. వక్ఫ్ బోర్డు భూముల విషయంలో అడ్వకేట్ మొయిజుద్దీన్, ఆలం ఖాన్ మధ్య వివాదం నడుస్తోందని చెప్పారు. దశబ్ధాల నుంచి వీరి మధ్య ఈ అంశంలో గొడవలు జరుగుతున్నాయన్నారు.
వక్ఫ్ బోర్డు భూ వివాదాల నేపథ్యంలోనే మొయిజుద్దీన్ హత్య జరిగిందని వెల్లడించారు. మొయిజుద్దీన్‌ను అంతమొందించేందుకు నిందితులు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తు్న్నారని తెలిపారు. హత్య అనంతరం నిందితులు హర్యానా పారిపోయారని.. అక్కడి నుంచి ఢిల్లీకి పరార్ అయ్యేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో శాస్త్రీయంగా విచారణ చేపట్టామని తెలిపారు.
హైదరాబాద్‌లో 2026, మే 23 తెల్లవారుజామున ఓ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. పక్కా స్కెచ్‌తో కారుతో ఢీకొట్టి హతమార్చారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఖాజా మొహిజుద్దీన్ (63) వృత్తిరీత్యా అడ్వకేట్. తన మామ హాస్పిటల్లో ఉండడంతో శనివారం ఉదయం ఆయనను చూసేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి.. రోడ్డుపై పార్క్ చేసిన తన కారు డోర్ తీస్తుండగా.. నంబర్ ప్లేట్ లేని ఒక కారు వేగంగా దూసుకొచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది.
దీంతో మొహిజుద్దీన్ ఎగిరి కొంతదూరంలో పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సదరు కారులోని దుండగులు వాహనంతో సహా అక్కడి నుంచి వేగంగా పారిపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఖాజా మొహిజుద్దీన్‌ను కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఖాజా మొహిజుద్దీన్ వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు కోర్టులో కొన్ని కేసుల తరఫున వాదిస్తున్నట్టు తెలిసింది. వక్ఫ్ బోర్డు భూ వివాదాల నేపథ్యంలోనే మొహిజుద్దీన్ ను ప్రత్యర్థులు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
