- పరిశ్రమలతో 33 ఒప్పందాలు చేసుకున్నం
- కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ పట్టా పుచ్చుకోగానే చేతిలో సర్టిఫికెట్‌తో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఉండాలన్నదే తమ లక్ష్యమని, అందుకే సర్కారు డిగ్రీ కాలేజీల్లో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్(ఏఈడీపీ) ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీదేవసేన అన్నారు. హైదరాబాద్ లోని రూసా భవనంలో ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి, సీఐఐ ప్రతినిధి శేఖర్ రెడ్డి తదితరులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, హెల్త్‌కేర్ వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ కొత్తగా 11 కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. ప్రస్తుతం 96 కాలేజీల్లో 24 ఏఈడీపీ కోర్సులను అందిస్తున్నామని, కేవలం థియరీకే పరిమితం కాకుండా, ప్రతి కోర్సులోనూ ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్‌లను తప్పనిసరి చేశామని వివరించారు. విద్యార్థులకు ఇండస్ట్రీలో కావాల్సిన నైపుణ్యాలను నేర్పించేందుకు పరిశ్రమల దిగ్గజాలతో 33 ఫంక్షనల్ ఒప్పందాలు చేసుకున్నామని పేర్కొన్నారు.
సర్కారు కాలేజీలపై పేరెంట్స్ పై నమ్మకం పెరిగిందని, అందుకే ఫస్ట్ ఫేజ్‌లో గతేడాది 22,460గా ఉన్న అడ్మిషన్లు ఈసారి 27,853కు పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో 97 కాలేజీలు నాక్ గుర్తింపు ఉందని, 36 కాలేజీలు అటానమస్ హోదా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఫిన్లాండ్ వంటి దేశాల్లోని ఉన్నత విద్యా పద్ధతులను అధ్యయనం చేసి, అక్కడున్న మంచి రిఫామ్స్ మన కాలేజీల్లో అమలు చేస్తున్నామన్నారు.
ఐఐటీ హైదరాబాద్, ఐఎస్‌బీ, ఈఎఫ్ఎల్‌యూ వంటి సంస్థల సహకారంతో కరికులమ్ ఆధునీకరించామని వెల్లడించారు. ఏఈడీపీ కోర్సులు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందాయన్నారు. కౌన్సిల్ రూపొందించిన కోర్సులకు బీఓఎస్ అనుమతి లేకపోవడంతో దోస్త్ లో పెట్టలేదన్నారు. బీబీఏ, బీసీఏ కోర్సులకూ ఏఐసీటీఈ అనుమతి తప్పని అని గుర్తుచేశారు. ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రస్తుతమున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో సిలబస్ అప్ డేట్ చేశామన్నారు.
సెమికండక్ట్ కోర్సులు ఐఐటీహెచ్ రూపొందించినవేనన్నారు. ఐఐటీహెచ్‌లో పొడక్ట్ బెస్ట్ పీహెచ్‌డీని ప్రదానం చేస్తున్నామన్నారు. దీనిలో వందల పేజీల థియరీ రాయాల్సిన అవసరం లేదని, ప్రొడక్ట్ చూపిస్తే చాలన్నారు. సమావేశంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్లు నాగేశ్వర్ రావు, వెంకటేశం, కళాశాల విద్యాశాఖ జేడీలు బాలభాస్కర్, రాజేందర్ సింగ్, ఎస్బీ టెట్ సెక్రటరీ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
