మన కాజుకు ఆస్కార్​ ఫిదా!

మన కాజుకు ఆస్కార్​ ఫిదా!

తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న  జీడిపప్పు బిజినెస్​లోకి అడుగుపెట్టాడు. కొత్త ఆలోచనతో వ్యాపారాన్ని పెద్దది చేయాలి అనుకున్నాడు. అందుకని ఎంట్రప్రెనూర్​గా మారాడు. ‘కర్మ’ బ్రాండ్ పేరిట టేస్టీ కాజు అమ్ముతున్నాడు. కొన్ని రోజుల్లోనే ఇతర దేశాల్లోని వాళ్లకు కూడా ఈ నట్స్ ఫేవరెట్ శ్నాక్స్​ అయ్యాయి. అంతేకాదు ఈ ఏడాది ఆస్కార్​కు నామినేట్ అయినవాళ్లకు ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్​లో ‘కర్మ’ నట్స్ ఉన్నాయి. రెండేండ్ల క్రితం గ్రామీ అవార్డులకు నామినేట్​ అయినవారి గిఫ్ట్ బ్యాగ్​లో కూడా ఉన్నాయివి. కేరళ నుంచి వచ్చి అమెరికాలో కాజు బిజినెస్​ చేస్తున్న ఈయన పేరు గణేశ్​ నాయర్.

ఆస్కార్​కు నామినేట్ అయిన వాళ్లకు దాదాపు కోటి రూపాయల విలువైన గిఫ్ట్​బ్యాగ్ ఇస్తారు. అందులో ఖరీదైన కాస్మొటిక్స్​, స్వీట్లు, పిల్లల బొమ్మలు ఉంటాయి. ఈ గిఫ్ట్​ బ్యాగ్​లో గణేశ్ ‘కర్మ’ నట్స్ కూడా ఉండడం విశేషం. రెండేండ్ల క్రితం గ్రామీ అవార్డ్​కి నామినేట్​ అయినవాళ్లకు వీగన్, వెల్​నెస్​ ప్రొడక్ట్స్​ని గిఫ్ట్​గా ఇవ్వాలనుకుంది గ్రామీ సెలక్షన్ కమిటీ. దాంతో, ‘కర్మ’ నట్స్​కి చోటు దక్కింది. అలాగే ఈ ఏడాది ఆస్కార్ కమిటీ కూడా ఈ టేస్టీ, హెల్దీ నట్స్​ని నామినేట్​ అయినవాళ్ల గిఫ్ట్​ బ్యాగులో చేర్చింది. 

పదేండ్లు జాబ్ చేసి..

గణేశ్ సొంతూరు కేరళలోని కొల్లాం. ఇక్కడ జీడిపప్పు ఎక్కువ పండిస్తారు. అందుకే కొల్లాంకు ‘కాజు క్యాపిటల్ ఆఫ్​ ఇండియా’ అని పేరు. గణేశ్ కుటుంబం తొమ్మిది తరాలుగా జీడిపప్పు బిజినెస్​లో ఉంది. వీళ్ల ఫ్యామిలీ నడిపే కంపెనీ పేరు ‘వెస్టర్న్ ఇండియా కాజు కంపెనీ’. దాంతో, చిన్నప్పటి నుంచి గణేశ్​ జీడిపప్పుల మధ్య పెరిగాడు. ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లాడు. మెసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్​లో హెల్త్ సైన్స్, టెక్నాలజీలో ఎం.ఎస్ చేశాడు. ఆ వెంటనే జాన్సన్​ అండ్ జాన్సన్​ కంపెనీ డయాబెటిక్ కేర్ యూనిట్​లో చేరాడు. పదేండ్ల తర్వాత జాబ్ మానేసి,  ఫ్యామిలీ బిజినెస్​లోకి వచ్చాడు గణేశ్. 

కొత్త ఆలోచనతో హిట్ 

బిజినెస్​లో మెలకువలు నేర్చుకునేందుకు అన్న హరి కృష్ణన్​తో కలిసి  కొన్ని రోజులు తమ కంపెనీలో పనిచేశాడు గణేశ్. అతను​ వ్యాపారంలోకి వచ్చేంత వరకూ వాళ్ల కంపెనీలో పొట్టు తీసిన జీడిపప్పునే అమ్మేవాళ్లు. బిజినెస్​లో తన మార్క్ చూపించాలి అనుకున్న గణేశ్ జీడిపప్పుల్ని పొట్టు తీయకుండానే వేగించి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ‘అలాచేస్తే, బిజినెస్ పడిపోతుంది?’ అన్నారంతా. కానీ, గణేశ్​ వెనక్కి తగ్గలేదు. పొట్టుతో ఉన్న జీడిపప్పులో పోషకాలు ఎక్కువని, అవి ఆరోగ్యానికి మంచివని న్యూట్రిషనిస్టులు, డాక్టర్లు చెప్పడంతో గణేశ్​ ఐడియా వర్కవుట్ అయింది. మనదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా జీడిపప్పు ఎగుమతి చేసేవాడు. అమెరికాలో మాత్రం జీడిపప్పు కంటే బాదం, పిస్తా ఎక్కువ కొనడం గమనించాడు. కాజుని అమెరికా ప్రజలకు ఎంతో ఇష్టమైన స్నాక్ చేయాలి అనుకున్నాడు. కాలిఫోర్నియాలో 2014లో ‘కర్మ’ పేరుతో సొంతంగా నట్స్ కంపెనీ పెట్టాడు గణేశ్. ఈ పేరు పెట్టడానికి కారణం..  వాళ్ల నాన్న రాజేంద్రనాథన్​ నాయర్ కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మడమే. ఇప్పుడు  అమెరికాలో 11 రుచుల్లో దొరుకుతోంది జీడిపప్పు.

హెల్దీ శ్నాక్స్ అందించాలని 

‘‘నేను కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ‘డు గుడ్. ఈట్ గుడ్. ఫీల్​ గుడ్​’ అనేది మా బ్రాండ్ లక్ష్యం. మా కుటుంబ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూనే, అందరికీ హెల్దీ శ్నాక్స్ అందించాలనే ఉద్దేశంతో ‘కర్మ’ని మొదలుపెట్టా. ఎలాగైతే పొట్టు తీయని ఆలుగడ్డ, యాపిల్​ తింటే  ఎక్కువ పోషకాలు అందుతాయో, పొట్టు 
తీయని జీడిపప్పు తింటే కూడా అన్ని పోషకాలు అందుతాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పొట్టు తీసిన జీడిపప్పులో కంటే వీటిలోనే ఫైబర్ ఎక్కువ” అంటున్నాడు గణేశ్.