యువతను నాశనం పట్టించే స్కీమ్

యువతను నాశనం పట్టించే స్కీమ్
  • జంతర్​ మంతర్ ​వద్ద పార్టీ సత్యాగ్రహ దీక్ష
  • అగ్నిపథ్ పై నిరసన చేస్తున్న యువకులకు మద్దతు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకం ఆర్మీ వ్యవస్థను, యువతను నాశనం పట్టిస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఉద్దేశాన్ని గమనించాలని, ఎవరు నకిలీ దేశభక్తులో గుర్తించాలని సూచించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. అగ్నిపథ్​పై నిరసన తెలుపుతున్న యువకులకు సంఘీభావంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’ చేపట్టింది. 3 గంటల పాటు సాగిన ఈ దీక్షలో ప్రియాంక, రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజయ్ మాకెన్, కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, సచిన్ పైలట్, దిపేందర్  హుడా, జేడీ శీలం,కొప్పుల రాజు, గిడుగు రుద్ర రాజు, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.  ఈ స్కీం ను వాపస్ తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడారు. బీజేపీ సర్కారు బడా బాబుల కోసమే పనిచేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువకులపై ఉందని, పేదలకోసం పనిచేసే ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ మద్దతు ఉంటుందని, అగ్నిపథ్​పై శాంతియుతంగా నిరసనలు తెలపాలని ప్రియాంక కోరారు. 

అగ్నివీరుల‌‌‌‌‌‌‌‌కు ఏ లాభం ఉండదు: ఉత్తమ్ 

దేశ రక్షణకు, దేశ యువతకు అగ్నిపథ్ వ్యతిరేకమ‌‌‌‌‌‌‌‌ని ఎంపీ ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. ఇదొక కాంట్రాక్ట్ పద్ధతి అని, ఇందులో చేరినోళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉండవని అన్నారు. ఇప్పటికే దేశంలో మాజీ సైనికులకు ఏలాంటి మేలు జరగడం లేదన్నారు. అగ్నిపథ్​ను రద్దు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

యువకులను నిప్పుల మీదికి నెట్టారు: రాహుల్ గాంధీ

ఆర్మీ రిక్రూట్​మెంట్ కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్​ స్కీమ్​.. నిరుద్యోగులను నిప్పుల మీద నడిచేలా చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ సర్కారు.. ఉద్యోగాలపై లేనిపోని ఆశలు కల్పించి యువతను ఎటూగాకుండా చేసిందని ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, ఎనిమిదేండ్ల ఆయన పాలనలో యువతకు పకోడీలు వేయించుకోవడంపై మాత్రమే అవగాహన వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలకు ప్రధానే బాధ్యత వహించాలన్నారు.