దేశవ్యాప్తంగా నిరసనలు

దేశవ్యాప్తంగా నిరసనలు
  • యూపీ, రాజస్తాన్, ఎంపీ, ఢిల్లీ, హర్యానాలోనూ నిరసనలు
  • రైల్వే స్టేషన్లే లక్ష్యంగా దాడులు 
  • రైళ్లకు నిప్పు.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం.. 
  • పోలీసులపైకి రాళ్లు
  • బీహార్‌‌లో ఓ ప్రయాణికుడి మృతి

న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’ చిచ్చు చల్లారడం లేదు. దేశమంతటా విస్తరిస్తున్నది. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టనున్న ఈ పథకానికి వ్యతిరేకంగా వరుసగా మూడో రోజూ ఆందోళనలు ఉధృతంగా సాగాయి. నిరసనకారులు రైళ్లను, రైల్వే స్టేషన్లను టార్గెట్ చేసుకుని దాడులకు దిగారు. ట్రైన్లకు నిప్పు పెట్టారు. స్టేషన్లలో ఫర్నిచర్​నూ వదల్లేదు.  బస్సులను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వేలాది ట్రాక్‌‌లు, హైవేలను బ్లాక్ చేశారు. బుధవారం నుంచి 12 దాకా రైళ్లను తగులబెట్టారు. బీహార్‌‌‌‌లో రైలులో మంటలు చెలరేగడంతో ఆందోళన చెందిన ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. దేశవ్యాప్తంగా 200 రైళ్లపై ప్రభావం పడిందని, 110 రైళ్లను రద్దు చేశామని, 47 ట్రైన్లను పాక్షికంగా రద్దు చేశామని అధికారులు చెప్పారు. హింసాత్మక ఆందోళనలకు పాల్పడొద్దని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దని యువకులను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విజ్ఞప్తి చేశారు.
 

బీహార్‌‌‌‌లో మొదలై..

  • అగ్నిపథ్ స్కీమ్‌‌లో భాగంగా నాలుగేళ్ల షార్ట్‌‌ టర్మ్, కాంట్రాక్ట్ బేసిస్‌‌ కింద రిక్రూట్‌‌మెంట్‌‌ చేస్తామని కేంద్రం ప్రకటించడంపై దేశవ్యాప్తంగా యువకులు, ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. బుధవారం బీహార్‌‌‌‌లో మొదలైన నిరసనలు.. శుక్రవారానికి 7 రాష్ట్రాలకు పాకాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానాలో ఆందోళనలు సాగుతున్నాయి.
  • బీహార్‌‌‌‌లోని లఖిసరయ్‌‌లో విక్రమశిల ఎక్స్‌‌ప్రెస్‌‌, సమస్తిపూర్‌‌‌‌లో బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌‌ప్రెస్‌‌ బోగీలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. లఖిసరయ్ స్టేషన్‌‌లో ట్రాక్‌‌లపై పడుకుని ట్రైన్ల రాకపోకలను అడ్డుకున్నారు. లఖిసరయ్‌‌లో రైలులో మంటలు చెలరేగడంతో ఆందోళన చెందిన ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. పాట్నాలో డిప్యూటీ సీఎం రేణు దేవి ఇంటిపై మూక దాడి చేసింది.
  • యూపీలోని బాలియా టౌన్‌‌లో ఓ రైలుకు నిప్పు పెట్టారు. అక్కడే ఉన్న బాలియా  వారణాసి మెము, బాలియా- షాగంజ్ రైళ్లపై దాడులు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. రైల్వే గోడౌన్ దగ్గర ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. స్టేషన్ ప్లాట్‌‌ఫామ్‌‌పై ఉన్న ప్రైవేటు షాపులే లక్ష్యంగా దాడులు చేశారు. బయట ఉన్న బస్సులనూ వదల్లేదు. ఆఫీసర్లు కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని వాయిదా వేశారు. వారణాసి, ఫిరోజాబాద్, అమేథీలోనూ నిరసనలు జరిగాయి. ఆగ్రా - లక్నో ఎక్స్‌‌ప్రెస్‌‌ వేపై ధర్నాలు చేశారు. ఆఫీసర్లపై రాళ్లు రువ్వారు. నాలుగు బస్సులను డ్యామేజ్ చేశారు.
  • మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌‌‌‌లో వందలాది మంది ట్రాక్‌‌లపై బైఠాయించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. సుమారు 600 మంది లక్ష్మీబాయ్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్‌‌లపై గుమిగూడటంతో పలు రైళ్లను ఆపేశారు. హర్యానాలో యువకులు రోడ్లపై టైర్లను కాల్చారు. నార్వానాలో రైల్వే ట్రాక్‌‌లపై బైఠాయించారు. పల్వాల్‌‌లో హింస నేపథ్యంలో ఫరీదాబాద్‌‌లోని బల్లాబ్‌‌గఢ్‌‌లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్‌‌ఎంఎస్‌‌ సర్వీసులను 24 గంటలపాటు ఆపేశారు. పల్వాల్‌‌లో చెలరేగిన హింసకు సంబంధించి వెయ్యి మందికి పైగా నిందితులపై  కేసులు నమోదు చేశారు.దేశరాజధాని ఢిల్లీలో మెట్రో సర్వీసులపై ఎఫెక్ట్ పడింది. ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యుల నిరసనలతో కొన్ని చోట్ల మెట్రో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసేశారు.

2 రోజుల్లో నోటిఫికేషన్: ఆర్మీ చీఫ్
అగ్నిపథ్ రిక్రూట్‌‌మెంట్​కు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. డిసెంబర్‌‌‌‌లో మొదటి అగ్నివీర్‌‌‌‌ల శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. అగ్నిపథ్ పథకం పెద్ద సంస్కరణ తీసుకొ స్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు. యువతకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌‌ను రూపొం దించారని ఎయిర్‌‌‌‌ మార్షల్ మానవేంద్ర సింగ్ చెప్పారు. అగ్నిపథ్ కింద రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను ఈనెల 24 నుంచి ప్రారంభిస్తామని ఎయిర్‌‌ఫోర్స్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వీఆర్ చౌధరి చెప్పారు.
రౌడీలు సైన్యంలోకి ఎందుకు?: ఆర్మీ మాజీ చీఫ్ మాలిక్
గూండాయిజం చేసే వాళ్లు, బస్సులు, రైళ్లకు నిప్పుపెట్టే వాళ్లు.. సాయుధ బలగాల్లో ఉండాలని తాము కోరుకోవడం లేదని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ అన్నారు. హింసకు బాధ్యులైన రౌడీలను రిక్రూట్ చేసుకునే ఆసక్తి తమకు లేదన్నారు.  ఇండియన్ ఆర్మీ అనేది వాలంటీర్ ఫోర్స్ అని, వెల్ఫేర్ సంస్థ కాదని అన్నారు. దేశకోసం పోరాడే వాళ్లు, దేశాన్ని కాపాడుకునే అత్యుత్తమ వ్యక్తులనే రిక్రూట్ చేసుకుంటామని కామెంట్ చేశారు.
అభ్యర్థులు ప్రిపరేషన్​ మొదలు పెట్టండి: రాజ్​నాథ్​ సింగ్​
అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్‌‌మెంట్ కొన్ని రోజుల్లోనే ప్రారంభమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ చెప్పారు. ఇందులో చేరాలనుకునే యువకులు ప్రిపరేషన్ మొదలుపెట్టాలని సూచించారు. దేశ సాయుధ దళాల్లో చేరాలనుకునే యువకులకు ఇది సువర్ణ అవకాశమని చెప్పారు. ఏజ్ లిమిట్‌‌ను 21 నుంచి 23 ఏండ్లకు పెంచడం వల్ల.. ఎక్కువ మంది యువకులు సైన్యంలో చేరుతారని చెప్పారు. ‘మోడీ సూచన మేరకు వయో పరిమితిని సడలించామని వివరించారు. ఈ ఒక్క సారి మాత్రమే ఈ సడలింపు ఉంటుందని చెప్పారు.