తెలంగాణలో నెల రోజులు వెనుకబడ్డ సాగు...215 మండలాల్లో లోటు వర్షపాతం

తెలంగాణలో నెల రోజులు వెనుకబడ్డ సాగు...215 మండలాల్లో లోటు వర్షపాతం
  •     నెల రోజుల జాప్యంతో 15 శాతమే సాగు
  •     215 మండలాల్లో లోటు వర్షపాతమే
  •     విత్తనాలు, వారి నార్లకు తప్పని ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: ఈ సారి వానాకాలం సాగు దాదాపు నెల రోజులు ఎన్కవడ్డది. జూన్ నెల ప్రారంభంలో ఊరించిన వానలు ఆ తరువాత మొహం చాటేశాయి. వారం రోజులుగా ప్రతిరోజూ మొగులు అయితున్నప్పటికీ వర్షాలు కురవడంలేదు. చినుకు రాక కోసం రైతులు ఆకాశంవైపు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్​లో అక్కడక్కడ వర్షాలు పడడం మినహా రాష్ట్రంలో వానలు పెద్దగా కురువడం లేదు. ఈ సీజన్​లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పడంతో.. రైతులు జూన్ మొదటి వారంలోనే పత్తి విత్తనం వేశారు. విత్తనాలు వేసి 20 రోజులు దాటినా చినుకు జాడే కానరాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 శాతం మాత్రమే సాగు నమోదైంది. ఇంకా చాలా ప్రాంతాల్లో వానలు లేక దుక్కులు దున్న లేదు.

నెల రోజుల ఆలస్యం

మృగశిర కార్తె తర్వాత సాధారణంగా వర్షపాతం సమృద్ధిగా నమోదవుతుంది. కానీ ఈ యేడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోదగిన వర్షపాతం నమోదు కాలేదు. రోహిణి కార్తెలో విత్తనం నాటితే మొలకలు మెరుగ్గా వస్తాయని, చీడ పీడలను తట్టుకుని పంట దిగుబడులు పెరుగుతాయని రైతులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో కార్తె ప్రారంభంలోనే పలు జిల్లాల్లో తొలకరి వానలతో పత్తులు వేయగా,  విత్తనాలు వేసిన తర్వాత నుంచి వానల జాడలేదు. వానలు లేక.. ఆ విత్తనాలు మట్టిలోనే వట్టి పోతున్నాయి. మొలకలు వచ్చిన చోట రక్షించుకునేందుకు రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. చాలా చోట్ల కూలీలతో మొక్కలకు నీళ్లు పోయిస్తున్నారు. బోర్లు, బావుల కింద సాగు చేసిన వారు నీళ్లు కట్టి మొక్కలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వరి నార్లు పోసే స్టేజ్​కు వచ్చింది. కీలకమైన ఈ స్టేజ్​లోనే సరైన వర్షాలు పడకపోతుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.

215 మండలాల్లో లోటు వర్షమే! గ్రౌండ్ వాటరూ అంతంతే

వేసవి ఎండలకు చెరువులు ఎండిపోగా, ప్రాజెక్టులు డెడ్​స్టోరేజీకి చేరాయి. భూగర్భజలాలు కూడా చాలా లోతుల్లోకి పడిపోయాయి. రాష్ట్రంలో రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించినప్పటికీ వర్షాలు మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. జూన్ సగటు సాధారణ వర్షపాతం 129.4 మిల్లీ మీటర్లు కాగా.. ఇప్పటి వరకు 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని ప్రకారం చూస్తే 11 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. రాష్ట్రంలోని 215 మండలాల్లో ఇప్పటికీ పెద్ద వర్షాలు పడలేదు. ఆయా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా మంచిర్యాల జిల్లాలో అత్యంత లోటు నమోదు కావడం గమనార్హం. ఆ జిల్లాలో 94 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో వర్షపాతం లోటు ఉంది.

పత్తి పెట్టిన రైతులకు పెట్టుబడి లాస్!

సీజన్​లో ముందస్తుగా విత్తనాలు వేసిన రైతులకు పెట్టుబడి లాస్ అయ్యే పరిస్థితి నెలకొంది. దుక్కిదున్నిన ట్రాక్టర్ కిరాయి, పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు, దుక్కి మందులకు కలిపి ఒక్కో రైతు ఎకరాకు రూ.10 వేల వరకు ఖర్చు చేశారు. విత్తనాలు మొలకెత్తక కొందరు, మొలకెత్తినా వానలు లేక మరికొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు కూడా ఇంకా తగ్గక పోవడంతో మొలిచిన మొలకలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.