
- తర్వాతి స్థానాల్లో సూరత్, నవీ ముంబై
- క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు కింద సికింద్రాబాద్‌కు అవార్డు
- స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: మన దేశంలో క్లీనెస్ట్ సిటీగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నిలిచింది. వరుసగా 8వ సారి టాప్ ప్లేస్ సాధించింది. సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీ (10 లక్షలకు పైగా జనాభా)లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా.. సూరత్ (గుజరాత్), నవీ ముంబై (మహారాష్ట్ర), విజయవాడ (ఏపీ) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇదే కేటగిరీలో 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల్లో నోయిడా, చండీగఢ్, మైసూర్ టాప్ త్రీలో ఉన్నాయి.
2024–25 సంవత్సరానికి సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానోత్సవం గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కలిసి అవార్డులను అందజేశారు. ఈసారి మొత్తం నాలుగు కేటగిరీలలో 78 అవార్డులు ఇచ్చారు.
సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్, టాప్ త్రీ సిటీస్ ఇన్ ఫైవ్ పాపులేషన్ కేటగిరీస్, స్పెషల్ కేటగిరీలో గంగా టౌన్స్, కంటోన్మెంట్ బోర్డులు, సఫాయిమిత్ర సురక్ష, మహాకుంభ్‌తో పాటు స్టేట్ లెవల్ కేటగిరీలో అవార్డులు ప్రకటించారు. ఈ సంవత్సరం కొత్తగా సూపర్ స్వచ్ఛ లీగ్, స్వచ్ఛ షహర్ కేటగిరీలు తీసుకొచ్చారు. స్వచ్ఛ షహర్ కేటగిరీ (10 లక్షలకు పైగా జనాభా)లో అహ్మదాబాద్, భోపాల్, లక్నో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
కాగా, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఢిల్లీ తన స్థానం మెరుగుపరుచుకుంది. మీడియం సిటీస్ కేటగిరీలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 31వ స్థానం సంపాదించుకుంది. పోయినేడాది 90వ ర్యాంక్ రాగా, ఈసారి 59 స్థానాలు ముందుకు వచ్చింది. కాగా క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు కింద ఇచ్చిన అవార్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ తొలిస్థానాన్ని సొంతం చేసుకుంది.
‘వ్యర్థాల రహిత నగరం’కేటగిరీలో హైదరాబాద్ 7 స్టార్ రేటింగ్ సాధించింది. ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ నగరాల జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్ చోటు దక్కించుకుంది. మరోవైపు, ఏపీలో ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్గా రాజమండ్రి నిలిచింది.