
హైదరాబాద్, వెలుగు: వేగంగా మారుతున్న నేటి విద్యా వ్యవస్థలో జెనరేటివ్ ఏఐ ఒక విప్లవాత్మక శక్తిగా నిలుస్తోందని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్) చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. పాఠాలు చెప్పే విధానాన్ని, నేర్చుకునే విధానాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుందని.. విద్యను అందరికీ చేరువ చేయడానికి, తెలివి తేటల్లో తేడాలు తగ్గించడానికి ఏఐ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. మంగళవారం టీజీసీహెచ్ ఆఫీసులో గంభీరావుపేట సర్కారు డిగ్రీ కాలేజీలో ప్రచురించిన అంతర్జాతీయ జర్నల్ స్పెషల్ ఇష్యూను ప్రొ. బాలకిష్టారెడ్డి రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.." ఏఐని నిజాయితీగా, బాధ్యతగా వాడుకోవాలి.
టెక్నాలజీ అనేది మనిషి మేధస్సు, ఆలోచనలకు సహాయం చేసేలా ఉండాలి. ఇంపాక్ట్ ఫ్యాక్టర్‌తో ఈ జర్నల్‌ను తీసుకొచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి, ఎడిటింగ్ టీమ్‌కు నా అభినందనలు. పరిశోధన పత్రాలతో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు కౌన్సిల్ మద్దతు ఇస్తాం" అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్.కె. మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.