- వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- విదేశాంగ విధానంలో కేంద్రానికి స్పష్టత కరువైంది
- గ్యాస్ కొరతపై పార్లమెంట్ ఆవరణలో పెద్దపల్లి ఎంపీ ఆందోళన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్, యూరియా సరఫరాలో సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నాయని, వీటిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విదేశాంగ విధానంలో కేంద్రానికి స్పష్టత కరువైందని విమర్శించారు. ప్రధాని మోదీ, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అవసరమైన చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా యూరియా కొరత మరింత పెరిగే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పార్లమెంట్ మకర ద్వారం ఎదురుగా ఎల్పీజీ కొరతపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ భారీ కటౌట్‌తో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతేడాది యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోపంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఇప్పుడు కూడా అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఎల్పీజీ, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దాని ప్రభావం యూరియా సరఫరాపై పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి ప్రధాని మోదీ, కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి జేపీ నడ్డా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజనపై ఏపీ ఎంపీవి అవగాహన లేని మాటలు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు అవగాహనరాహిత్యంతో మాట్లా డుతున్నారని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. తెలం గాణ బిల్లు పాస్ అయినప్పుడు అసలు ఆయన ఎంపీ కారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ ఏర్పాటును కించపరిచే, తమ రాష్ట్ర ప్రజలను అవమానించేలా శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. స్వరాష్ట్రం కోసం కేంద్ర మాజీ మంత్రి కాకా, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎందరో పోరాటాలు చేశారన్నారు. కాకా వెంకటస్వామి బుల్లెట్ గాయాలు కూడా తిన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాకుండా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై చర్చకు రావాలని శ్రీకృష్ణదేవరాయలుకు సవాల్ విసిరారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్‌తో చంద్రబాబు, లోకేశ్ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు.
గతాన్ని మర్చిపోయావా కేటీఆర్?
బీఆర్ఎస్ హయాంలో చేసిన రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మర్చిపోయారా అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. వరుస ఓటములతో కేటీఆర్ తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. తండ్రి కేసీఆర్ ప్రతిష్టపై ఆధారపడి రాజకీయాలు చేస్తూ.. సీఎం అవుతాననే కలలో ఆయన బతికారని విమర్శించారు. బుధవారం రాత్రి స్పీకర్ అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ అనంతరం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై, ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 2019లో అధికార అహంకారంతో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 10–12 మంది ఎమ్మెల్యేలను లాక్కున్న విషయం ప్రజలకు గుర్తుందన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శించే ముందు ట్విట్టర్ టిల్లు గతాన్ని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై నమ్మకం కోల్పోయా రని, ప్రజల తీర్పుతో ఆ పార్టీ రాజకీయంగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందన్నారు.
