- ఇతర రాష్ట్రాల్లో కొని నగరానికి
- దుర్వాసన రాకుండా డీప్ ఫ్రీజర్లు,
- ప్లాస్టిక్ టబ్‌లలో నిల్వ
- ఫ్రెష్ అంటూ కస్టమర్లకు అమ్మకం
- 300 కేజీల మాంసం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్
మెహిదీపట్నం, వెలుగు: మంగళ్హాట్పరిధిలో కుళ్లిన మాంసం దందా గుట్టురట్టైంది. అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి అరెస్ట్ చేశారు. బుధవారం గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. మహ్మద్ అఫ్రోజ్ (41) అనే వ్యక్తి అక్రమ లాభాల కోసం కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు జబ్బులు పడిన లేదా చనిపోయిన మేకలు, గొర్రెల మాంసం సేకరిస్తున్నాడు.
మంగళ్‌హాట్ పరిధి చిస్తి చమాన్ లోని ఎ టూ జెడ్ మీట్ షాపులో దుర్వాసన రాకుండా డీప్ ఫ్రీజర్లు, ప్లాస్టిక్ టబ్‌లలో వీటిని నిల్వ ఉంచి, ఆ మాంసాన్ని తాజాగా ఉన్నట్లు నమ్మించి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో ఈ దుకాణంపై ఈ నెల 10న అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 300 కిలోల మేక, గొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నిందితుడిపై పలు కేసులు ఉన్నాయని తెలిపారు.
ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో ఆహారపదార్థాలు కొనుగోలు చేయవద్దని డీసీపీ కోరారు. జోన్ డీసీపీ చంద్ర మోహన్, ఏసీపీ సుదర్శన్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు వినోద్, శృతి, సిబ్బంది ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు.
