ఏఐ అతిపెద్ద ఇన్వెస్ట్‌‌మెంట్ బబుల్‌‌.. స్పెక్యులేషన్ చాలా ఎక్కువగా ఉంది: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు

ఏఐ అతిపెద్ద ఇన్వెస్ట్‌‌మెంట్ బబుల్‌‌.. స్పెక్యులేషన్ చాలా ఎక్కువగా ఉంది: జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు

న్యూఢిల్లీ: సాఫ్ట్‌‌వేర్ కంపెనీ జోహో ఫౌండర్  శ్రీధర్ వెంబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని ఒక 'ఇన్వెస్ట్‌‌మెంట్ బబుల్'గా అభివర్ణించారు. ఏఐ టెక్నాలజీ నిజమైనదే అయినప్పటికీ, దాని చుట్టూ జరుగుతున్న ఆర్థిక ఊహాగానాలు, ఇన్వెస్ట్‌‌మెంట్లు భారీగా వస్తుండడం మునుపెన్నడూ లేని విధంగా ఉన్నాయని ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

సాధారణంగా ప్రతి టెక్ రివల్యూషన్ ఒక ఇన్వెస్ట్‌‌మెంట్ బబుల్‌‌ను క్రియేట్ చేస్తుందని,  అయితే ఏఐ చుట్టూ ఉన్న బబుల్‌‌ ఇప్పటివరకు వచ్చిన వాటిల్లోకెల్లా అతిపెద్దదని అభిప్రాయపడ్డారు.  నష్టపోకుండా ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవడమే కీలకమని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు.  క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్‌‌ల నిజమైన డిమాండ్‌‌ను ఏఐ ఎక్కువగా చేసి చూపిస్తోందన్న  'బుల్ థియరీ' అనే సోషల్ మీడియా అకౌంట్‌‌ పోస్ట్‌‌కు శ్రీధర్ వెంబు స్పందించారు. 

మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు చూపించే ఫ్యూచర్‌‌‌‌ క్లౌడ్ రెవెన్యూ సగానికి పైగా వాటా కేవలం ఓపెన్ఏఐ , ఆంత్రోపిక్  సంస్థల నుంచే వస్తోందని బుల్ థియరీ ఆరోపించింది. పెద్ద టెక్ కంపెనీలు ఏఐ స్టార్టప్‌‌లలో పెట్టే పెట్టుబడులు తిరిగి వాటి క్లౌడ్ సేవలను కొనుగోలు చేయాలనే నిబంధనలతో ముడిపడి ఉన్నాయని పేర్కొంది.

ఉదాహరణకు, మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐలో పెట్టిన 13 బిలియన్ డాలర్ల పెట్టుబడిని 'క్లౌడ్ క్రెడిట్స్' రూపంలో ఇచ్చిందని, వాటిని మైక్రోసాఫ్ట్ సర్వీస్‌‌ల కోసం ఓపెన్ఏఐ వాడుకుంటోందని తెలిపింది. దీనిని  మైక్రోసాఫ్ట్ కొత్త 'క్లౌడ్ రెవెన్యూ'గా చూపించుకుంటోందని వివరించింది.