ఏఐ పోలీసింగ్..నిర్మల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు

ఏఐ పోలీసింగ్..నిర్మల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు
  •     ఇక పక్కాగా కేసుల దర్యాప్తు
  •     కృత్రిమ మేధతో కేసుల ఇన్వెస్టిగేషన్

నిర్మల్, వెలుగు: పోలీస్​ స్టేషన్లలో నమోదవుతున్న వివిధ రకాల కేసులను ఇప్పటివరకు సాధారణ సాంకేతికతో దర్యాప్తు చేస్తున్న పోలీస్  శాఖ.. ఇక నుంచి ఏఐ(ఆర్టిఫిషియల్  ఇంటలిజెన్స్)ను వినియోగించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు సీసీటీఎన్ఎస్(క్రైమ్  అండ్  క్రిమినల్  ట్రాకింగ్  నెట్​వర్క్  సిస్టం)కు ఏఐని అనుసంధానం చేసి కేసుల దర్యాప్తు చేపట్టబోతున్నారు. పోలీస్​ శాఖ సీసీటీఎన్ఎస్  ఏఐ అమలు కోసం పైలెట్  ప్రాజెక్టుగా నిర్మల్  జిల్లాను  ఎంపిక చేసింది.

జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఇక నుంచి కేసుల దర్యాప్తును వేగవంతంగా, పకడ్బందీగా చేపట్టేందుకు ఏఐ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ వోలకు శిక్షణతో పాటు  నిర్వహణపై అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల దర్యాప్తు చేపట్టే అధికారులకు ఈ టెక్నాలజీ ద్వారా పూర్తి స్థాయి సమాచారం అందుబాటులోకి రానుంది. అలాగే కేసుల నమోదు, దర్యాప్తు సమయంలో కూడా చట్టపరమైన అంశాలు, ఈ కేసులకు సంబంధించిన విశ్లేషణలు, డిజిటల్  ఆధారాల పరిశీలనలో టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుందని పోలీస్  అధికారులు చెబుతున్నారు.

ఇక శాస్త్రీయంగా కేసుల దర్యాప్తు..

ఏఐ సహకారంతో చేపట్టబోతున్న కేసుల దర్యాప్తు ఇక నుంచి పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా ఉండబోతోంది. సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగమేనంటున్నారు. ముఖ్యంగా బలమైన సాక్ష్యాలను సేకరించి వాటిని కోర్టులో నిరూపించేంత వరకు ఏఐ టెక్నాలజీ వినియోగించుకోనున్నారు. నిందితులకు శిక్ష పడేలా ఏఐ తోడ్పడబోతోందని పోలీస్  ఆఫీసర్లు చెబుతున్నారు. నిందితులకు శిక్ష రేటు పెంచడమే ఈ పైలెట్  ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని అంటున్నారు.

స్టేషన్ల వారీగా శిక్షణ..

సీసీటీఎన్ఎస్  ఏఐ సాంకేతికత వినియోగంపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ వోలకు ఇప్పటికే శిక్షణ అందించారు. అలాగే జిల్లా పోలీస్  ఆఫీస్​లోని టెక్నికల్  విభాగం ఎప్పటికప్పుడు స్టేషన్ల వారీగా ఏఐ అమలును పర్యవేక్షించనుంది. ఓ వైపు కేసుల దర్యాప్తు పక్కాగా పూర్తి చేస్తూనే, సంబంధిత కేసులలోని బాధితులకు సత్వర న్యాయం అందేలా చూసేందుకు కూడా ఏఐ ఉపయోగపడనుంది.

కేసుల దర్యాప్తు  వేగవంతం కోసమే..

వివిధ కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు కేసులకు సంబంధించిన సాక్ష్యాలను నిరూపించేందుకు ఏఐ టెక్నాలజీ తోడ్పడనుంది. సీసీటీఎన్ఎస్  ఏఐ టెక్నాలజీని నిర్మల్  జిల్లాలో పైలెట్  ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం. ఏఐ అమలుతో కేసుల దర్యాప్తు మరింత శాస్త్రీయంగా చేపట్టే అవకాశం ఏర్పడింది. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ వోలకు ఏఐ టెక్నాలజీ వినియోగంపై ఇప్పటికే పూర్తి స్థాయి అవగాహన కల్పించాం.         - జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్