ఆధార్ తరహా ఏఐ సేవలు అందించాలి

ఆధార్ తరహా ఏఐ సేవలు అందించాలి

వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. రాబోయే రెండేళ్లలో భారతీయులందరికీ ఏఐ ఆధారిత ట్యూటర్లు, డాక్టర్లు, వ్యవసాయ నిపుణులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సేవలను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించాలని  కోరారు. ఆధార్ ఆధారిత యూపీఐ మాదిరే, ఏఐ సేవలను ప్రతి పౌరుడికి అందించవచ్చని తెలిపారు. ఇందుకు లాభాపేక్ష లేని ఒక సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 

ముఖ్యంగా సామాన్య ప్రజలకు మేలు చేసే అప్లికేషన్లపై దృష్టి పెట్టాలని ఖోస్లా అన్నారు. అప్పుడే ఏఐ వల్ల దేశవ్యాప్తంగా సానుకూల మార్పు వస్తుందని వివరించారు. విద్యా రంగంలో మానవ ట్యూటర్ల కంటే మెరుగ్గా పనిచేసే ఏఐ ట్యూటర్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ప్రభుత్వానికి చెందిన దీక్ష ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏఐతో అనుసంధానిస్తే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఆరోగ్య రంగంలో ప్రాథమిక వైద్య సేవలను 24 గంటల పాటు ఉచితంగా లేదా అతి తక్కువ ఖర్చుతో అందించవచ్చని ఖోస్లా వివరించారు.