- మనువాదం, సామ్రాజ్యవాదంపై రాజీలేని పోరాటం: ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి కనినిక
- ముగిసిన 14వ ఐద్వా జాతీయ మహాసభలు
హైదరాబాద్, వెలుగు: మహిళలకు హక్కులిస్తే తీసుకుంటాం.. ఇవ్వకపోతే లాక్కుంటాం.. అంతే తప్ప మధ్యలో వదిలే ప్రసక్తే లేదని, మనువాద శక్తులపై చివరి వరకు పోరాడుతామని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నూతన జాతీయ ప్రధాన కార్యదర్శి కనినిక ఘోష్ బోస్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో 4 రోజుల పాటు జరిగిన ఐద్వా 14వ జాతీయ మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఐద్వా జాతీయ నాయకులు తపసి ప్రహరాజ్, మరియం ధావ్ లే, మల్లు లక్ష్మితో కలిసి కనినిక ఘోష్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజలది కాదని.. కేవలం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందని కనినిక ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో అణగారిన వర్గాలు, దళితులు, ఆదివాసీల హక్కులను కేంద్రం హరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో సగమున్న మహిళలకు పోరాటం తప్ప వేరే మార్గం లేదని తేల్చి చెప్పారు. కార్మికులు తలపెట్టిన ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెలో ఐద్వా దేశవ్యాప్తంగా పాల్గొంటుందని ప్రకటించారు.
భవిష్యత్ తరాల కోసం గళమెత్తాలి: పీకే శ్రీమతి
మన పూర్వీకుల పోరాటాల ఫలితమే నేటి మన జీవితమని, మన పిల్లలకు మెరుగైన జీవితం అందించడానికి మహిళలు గళం విప్పాలని ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి పిలుపునిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మనుస్మృతిని భుజాన వేసుకుని మహిళల జీవించే హక్కును కాలరాస్తున్నాయని విమర్శించారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమించక తప్పదని స్పష్టం చేశారు. బీజేపీ సర్కారు చట్టాల్లో మనువాద విషాన్ని నింపుతోందని ఐద్వా మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు మరియం ధావ్ లే ఆరోపించారు.
