ఫుట్‌బాల్‌ క్రీడాకారిణుల పట్ల AIFF అధికారి అసభ్యకర ప్రవర్తన.. అరెస్ట్

ఫుట్‌బాల్‌ క్రీడాకారిణుల పట్ల AIFF అధికారి అసభ్యకర ప్రవర్తన.. అరెస్ట్

హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఖాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ క్రీడాకారిణులకు చేదు అనుభవం ఎదురైంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్‌ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మ మహిళా క్రీడాకారిణుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఫుల్లుగా మద్యం సేవించి.. వారి హోటల్ గదిలోకి ప్రవేశించడమే కాకుండా.. బౌతికంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై క్రీడాకారిణులు ఫిర్యాదు చేయడంతో గోవా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

గోవాలో జరుగుతున్న ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యుఎల్) 2024 లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఖాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ పాల్గొంది. ఈ క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపక్ శర్మ హోటల్ గదిలో తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన ఫుల్లుగా తాగి ఉన్నారని, అలాగే హిమాచల్ ప్రదేశ్‌ నుంచి గోవాకు వస్తోన్న సమయంలో కూడా ఆయన తమ ముందే మద్యం తాగారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.  

ఈ ఘటన మార్చి 28న జరగ్గా.. దీపక్ శర్మను గోవా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనిపై మపుసా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందేశ్ చోడంకర్ మాట్లాడుతూ.. గాయపరచడం, మహిళపై బలవంతం చేయడం వంటి ఇతర ఆరోపణలతో సహా వివిధ సెక్షన్ల కింద మపుసా పోలీసులు ఆయనను అరెస్టు చేశారని తెలిపారు. అనంతరం ఆయనను వైద్య పరీక్షలు నిర్వహించారు. శర్మను రాత్రి కస్టడీలో ఉంచుతారని, మార్చి 31(ఆదివారం) కోర్టు ముందు హాజరుపరుస్తారని డిప్యూటీ సూపరింటెండెంట్ వెల్లడించారు.