నాపై కాల్పులు చేసినోళ్లలో ఒకడిని పట్టుకున్నం

నాపై కాల్పులు చేసినోళ్లలో ఒకడిని పట్టుకున్నం
  • యూపీలో కాల్పుల ఘటనపై V6తో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్‌లో పర్యటించి.. తిరిగి ఢిల్లీ వెళ్తుండగా ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడిన ఆయన మరో వెహికల్‌లో ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఆయన ఈ ఘటనపై V6తో మాట్లాడారు. తనపై దాడి జరిగిన తీరును వివరించారు.

ఇలాంటి ఘటనలకు భయపడేది లేదు.. మళ్లీ ప్రచారానికి వెళ్తా

‘‘యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరట్, కిఠౌర్ ప్రాంతాల్లో ఈ రోజు పాదయాత్ర చేశాం.  ప్రచార కార్యక్రమాలను ముగించుకుని ఢిల్లీకి తిరిగి ప్రయాణమయ్యాం. నా కారుతో పాటు ముందు ఒక సఫారీ, వెనుకాల రెండు ఫార్చ్యూనర్లతో వెళ్తున్నాం. ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గరకు రాగానే బారికేడ్ల కారణంగా మా వాహనాలు స్లో అయ్యాయి. ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. నా కారు డ్రైవర్ కాల్పులు జరుగుతున్నాయని గ్రహించాడు. వెంటనే మా ముందున్న వాహనాన్ని ఢీకొడుతూ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. మా కారు ఎడమ వైపు రెండు బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. కాల్పులు జరిపినవారిలో ఒకరు ఎరుపు జాకెట్, ఒకరు తెలుపు జాకెట్ ధరించి ఉన్నారు. మా వెనకాల ఉన్న ఫార్చ్యూనర్‌లో ఉన్నవాళ్లు దుండగులపైకి వాహనాన్ని తీసుకెళ్లారు. అందులో ఒకరి కాలుపై నుంచి ఫార్చ్యూనర్ వెళ్లింది. తెలుపు జాకెట్లో ఉన్న వ్యక్తి అక్కణ్ణుంచి పారిపోయాడు. కాసేపటి తర్వాత అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి ఫోన్ చేశారు” అంటూ కాల్పుల ఘటన గురించి అసదుద్దీన్ ఒవైసీ వివరించారు. 

గాందీని చంపిన వారి వెనుక ఉన్నవాళ్లే తనను చంపడానికి ప్రయత్నించిన వాళ్ల వెనుక కూడా ఉన్నారని ఒవైసీ అన్నారు. కాల్పులకు పాల్పడినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, కాల్పులకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. యూపీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరగడం వెనుక కచ్చితంగా రాజకీయ కారణాలున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై శుక్రవారం పార్లమెంటులో మాట్లాడుతానని, దీనిపై లోక్‌సభ స్పీకర్‌‌కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఇలాంటి ఘటనలకు భయపడేది లేదని, మళ్లీ యూపీలో ప్రచారం కొనసాగిస్తానని చెప్పారు. 

నా తలకు తగిలితే పరిస్థితి ఏంటి?

ఈ కాల్పుల ఘటనపై యూపీ మంత్రి ఒకరు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, కావాలని ఎవరైనా కాల్పులు చేయించుకుంటారా అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బులెట్‌ కారుకు తగలింది కాబట్టి సరిపోయిందని, అదే తన తలకు తాకితే పరిస్థితి ఏంటని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను లొంగనని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, ఘటనకు కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. తాను 1994 నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నానని, ఎప్పుడూ సెక్యూరిటీ అడగలేదని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో 2,421 కొత్త కేసులు

ప్రధాని మోడీ మాట తప్పారు

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.3 వేల కోట్లు