ప్రధాని మోడీ మాట తప్పారు

ప్రధాని మోడీ మాట తప్పారు

కేంద్ర బడ్జెట్ రైతులను నిరాశ పరిచిందని భారత్‌ కిసాన్‌ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. బడ్జెట్‌పై రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారని, ఈ సారి కేంద్రం ఎంతో మేలు చేస్తుందని ఆశించారని, కానీ అవేం జరగలేదని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో బడ్జెట్‌లో రైతులకు జరిగిన అన్యాయంపై పాంప్లేట్స్ పంచుతామని, రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకులను నిలదీయాలని రైతులను కోరుతామని రాకేశ్ తికాయత్ చెప్పారు.

చెరుకు రైతుల నుంచి పంట కొనుగోలు చేశాక కేవలం పద్నాలుగు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తామని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, కానీ ఈ చెల్లింపుల విషయంలో ఆలస్యం జరుగుతోందని రాకేశ్ తికాయత్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాటతప్పారని, ఆయన అబద్దాలు చెప్పారని ఆరోపించారు. 14 రోజుల్లో చెరుకు రైతులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పగా.. 11 నెలలు తర్వాత డబ్బులు వచ్చాయని చెప్పారు. యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అనేక మంది రైతులకు ఇప్పటికీ డబ్బులు రాలేదని, పైగా ఏ ఒక్కరికీ కనీస మద్దతు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓట్ల అడగడానికి వచ్చే నాయకుల్ని నిలదీయండి

ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడూ నాయకులు.. రైతుల్ని, ప్రజలను కలిసి సమస్యలు తీసుకోవడం లేదని రాకేశ్ తికాయత్ అన్నారు. ఈ సారి ఓట్లు అడగడానికి వచ్చే నాయకులను రైతులంతా నిలదీయాలని ఆయన కోరారు. ‘‘మీ సమస్యలను మీ భాషలోనే నాయకుల దృష్టికి తీసుకెళ్లండి” అని సూచించారు. 

రైతులపై ప్రతీకారం తీర్చుకునేందుకు..

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాది పైగా పోరాడిన రైతులపై ఈ బడ్జెట్‌ ద్వారా ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నం చేశారని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని, అందుకే అలాంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని ఆయన మండిపడ్డారు. ఏడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆ పార్టీ హామీ ఇచ్చినట్లుగా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్‌లో పెట్టిన కేటాయింపులు.. కేవలం రైతుల పండించే పంట కొనుగోలుకే సరిపోతాయని, వాస్తవానికి రైతుకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించారని యోగేంద్ర అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.3 వేల కోట్లు

మరో చాన్స్ ఇస్తే యూపీని దేశంలోనే నంబర్ వన్ చేస్తం

మేడారం జాతరలో బెల్లం బంగారం ఎలా అయ్యిందో తెలుసా?