సమాజ్‌వాదీ అభ్యర్థులుగా మాఫియా లీడర్లు

సమాజ్‌వాదీ అభ్యర్థులుగా మాఫియా లీడర్లు

ఉత్తరప్రదేశ్‌లో ఐదేళ్లలో మాఫియాను పూర్తిగా అంతమొందించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కొందరు మాత్రం సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్ వెంట ఉండి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వస్తున్నారంటూ పరోక్షంగా రాష్ట్రీయ లోక్‌ దళ్ పార్టీ చీఫ్, జాట్ నేత జయంత్ చౌదరి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఆయన మాటలను అఖిలేశ్ వినే పరిస్థితి ఉండదన్నారు. గతంలోనూ అనేక సార్లు ఆ పార్టీతో పొత్తుకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అమిత్‌ షా చెప్పారు. యూపీఏ హయాంలో ఉత్తరప్రదేశ్‌కు చాలా తక్కువ నిధులిచ్చారని, తాము మాత్రం రూ.1.46 లక్షల కోట్లు ఇచ్చామని తెలిపారు. ఇవాళ అమిత్ షా.. యూపీలోని అనూప్ షహర్‌లో ప్రచారం బీజేపీ తరఫున ప్రచారం చేశారు. యూపీలో మరోసారి బీజేపీదే అధికారమని, మూడింట రెండొంతుల మెజారిటీతో యోగి ప్రభుత్వం రాబోతోందని ఆయన అన్నారు. 

గడిచిన ఐదేండ్ల పాలనలో యూపీలోని మాఫియా లీడర్లను జైలులో పెట్టామని, కొంత మంది భయంతో రాష్ట్రం వదిలి పారిపోతే, మరికొంత మంది ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులుగా ఉన్నారని అమిత్ షా చెప్పారు. పశ్చిమ యూపీలో మాఫియా లేకుండా చేస్తామని గత ఎన్నికల్లో చెప్పామని, ఆ మాట నిలుపుకొన్నామని అన్నారు. రాష్ట్రంలో నేరాలు చేసే ధైర్యాన్ని చంపేశామని, మహిళల భద్రత సమస్య లేకుండా చేశామని అన్నారు. మాఫియా గ్యాంగ్‌ల నుంచి కోట్ల రూపాయల డబ్బును యూపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, అదంతా సమాజ్‌వాదీ పార్టీ గూండాలదేనని అన్నారు. 

వాళ్లు అధికారం ఉండగా.. టెర్రరిస్టులు మన సైనికుల తలలు తీసుకెళ్లారు

ఉత్తరప్రదేశ్‌ను యోగి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, రాష్ట్రాన్ని పూర్తి మార్చేసిందని, ప్రధాని మోడీ దేశ భద్రత కోసం పని చేస్తున్నారని అమిత్  షా చెప్పారు. మరోసారి యూపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మోడీకి మరింత బలాన్ని చేకూర్చినట్లవుతుందని ప్రజలను కోరారు. జమ్ము కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అక్కడ అల్లరి మూకల రాళ్ల దాడుల ఘటనలు పూర్తిగా బంద్ అయ్యాయని, కానీ ఆర్టికల్ 370 రద్దు సమయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌ పార్టీలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించాయని గుర్తు చేశారు. ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పాకిస్థాన్‌ నుంచి టెర్రరిస్టులు వచ్చి మన సైనికుల తలలు తీసుకెళ్లారని, ఇప్పుడు టెర్రరిస్టులు దాడులు చేయడానికి భయపడే పరిస్థితిని తమ ప్రభుత్వం తీసుకురాగలిగిందని అమిత్‌ షా చెప్పారు. పుల్వామాలో మన సైనికులపై ఒకసారి దాడి జరిగితే దానికి ప్రతిస్పందనగా మోడీ ప్రభుత్వం సర్జికల్స్ స్ట్రైక్స్ చేయించిందని, మన ఆర్మీ నేరు పాకిస్థాన్‌లోకి పోయి టెర్రరిస్టుల స్థావరాలను ధ్వంసం చేసి, వారిని హతమార్చి వచ్చిందని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రధాని మోడీ అటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలని మోడీ కోరుకుంటున్నారని, ఈ ఐదేళ్లలో చేసిన డెవలప్‌మెంట్‌ను కొనసాగించే అవకాశం ఇవ్వాలని ప్రజలను షా కోరారు. మరో ఐదేళ్లు బీజేపీకి అవకాశం ఇస్తే యూపీని దేశంలోనే నంబర్‌‌ వన్ రాష్ట్రంగా నిలబెడతామని చెప్పారు. 

రామ మందిరం కోసం బీజేపీ నేత.. సీఎం పదవి వదులుకున్నారు

‘‘గతంలో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌ పార్టీలు అధికారంలో ఉండగా రైతుల నుంచి పంటను కూడా కొనుగోలు చేయలేదు. మోడీ ప్రభుత్వం వచ్చే ఏటా రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున జమ చేస్తోంది. మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తోంది. పంట కొనుగోలు చేశాక నేరుగా వారి డబ్బును అకౌంట్లలో డిపాజిట్ అవుతోంది” అని అమిత్‌ షా చెప్పారు. ఒక వైపు బీజేపీ సీఎం కల్యాణ్ సింగ్.. అయోధ్య రామ మందిరం కోసం సంతోషంగా తన సీఎం కుర్చీని వదులుకుంటే.. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం కర సేవకులపై కాల్పులు జరిపిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ.. అయోధ్యలో భవ్యమైన రామ మందిరానికి శంకుస్థాపన చేసి, నిర్మాణం చేపడుతున్నారని చెప్పారు.

కాగా, యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల కౌంటింగ్ మార్చి పదిన చేపట్టి ఈసీ ఫలితాలను వెల్లడించనుంది.

మరిన్ని వార్తల కోసం..

ఆదివారం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కాంగ్రెస్

ఎడ్లబండిపై గురువు.. బండిలాగిన విద్యార్థులు

మేడారం జాతరలో బెల్లం బంగారం ఎలా అయ్యిందో తెలుసా?