ఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత.. ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం

ఢిల్లీలో మరోసారి క్షీణించిన గాలి నాణ్యత.. ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం

ఢిల్లీలో వాయు కాలుష్యం అక్కడి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌.. ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. అగ్నిమాపక దళానికి చెందిన పలు ఫైరింజన్లు పరిస్థితి తీవ్రంగా ఉన్న హాట్‌స్పాట్‌లలో ఇప్పటికే నీటిని పిచికారీ చేసే పనుల్లో నిమగ్నమయ్యాయి.

దట్టమైన పొగమంచు కారణంగా విషపూరిత వాయువులు ఢిల్లీని ఆరో రోజూ కమ్మేశాయి. ఆదివారం (నవంబర్ 5) మరోసారి గాలి నాణ్యత సూచి ‘అతి తీవ్రమైన కేటగిరీ’కి చేరింది. రాత్రిపూట గాలులు మరీ నెమ్మదిగా వీస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొందని అక్కడి అధికారులు చెబుతున్నారు. శనివారం (నవంబర్ 4) సాయంత్రం 4 గంటల సమయంలో 415గా ఉన్న గాలి నాణ్యత సూచి ఆదివారం (నవంబర్ 5) ఉదయం 7 గంటల సమయానికి 460కి ఎగబాకింది. ఆ తరువాత ఉదయం 11 గంటల కల్లా అది 461గా రికార్డైందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) చెప్పింది. 

తీవ్రమైన కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను నవంబరు 10వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆతిషి తెలిపారు. మరోవైపు కేంద్రం నిర్దేశించిన గాలి కాలుష్య నియంత్రణ ప్రణాళిక ప్రకారం.. అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. కాలుష్యాన్ని వెదజల్లే టక్కులు, నాలుగు చక్రాల వాణిజ్య వాహనాల రాకపోకలను నిషేధించారు. దుమ్ము రేపే నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేశారు. 

వాయు నాణ్యత సూచీలు క్షీణిస్తుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. వాయు కాలుష్య నియంత్రణకు నాలుగో దశ కింద కఠిన చర్యల్ని ప్రకటించింది. ఢిల్లీలోకి అత్యవసర సేవలను అందించే వాహనాలు మినహా వాయు కాలుష్య కారక ట్రక్కులు, నాలుగు చక్రాల కమర్షియల్‌ వాహనాల రాకపై నిషేధం విధించింది. 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సీఎన్జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌ VI వాహనాలను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని సూచించింది. హైవేలు, రోడ్లు, ఫ్లై ఓవర్లు, ఓవర్‌బ్రిడ్జ్‌లు, పవర్ ట్రాన్స్‌మిషన్, పైప్‌లైన్‌లు వంటి పబ్లిక్ ప్రాజెక్ట్‌లతో పాటు అన్ని రకాల నిర్మాణం, కూల్చివేత కార్యకలాపాలపై  నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణకు అన్ని అత్యవసర చర్యలు అమలు చేయాలని ఢిల్లీ, రాజధాని ప్రాంతం పరిధిలోని రాష్ట్రాలను కోరింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50శాతం సిబ్బందితో, మిగతా సిబ్బంది ఇంటి నుంచి పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.