పొగ మంచుతో ఢిల్లీవాసుల అవస్థలు

పొగ మంచుతో ఢిల్లీవాసుల అవస్థలు

దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. కాలుష్యం తీవ్రంకావడం, మరోవైపు శీతాకాలం సమీపిస్తుండటంతో ఒక్కసారిగా పొగ మంచు అలుముకుంది. ఓ వైపు కాలుష్యం, మరోవైపు పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గాలి నాణ్యత సూచి కూడా ప్రమాదకరస్థాయికి చేరడంతో.. కాలుష్యం మరింత ఎక్కువ అవుతోంది. కాలుష్యాన్ని అదుపు చేయకపోతే రానున్న రోజుల్లో పొగ మంచు ప్రభావం భారీగా పడే అవకాశం కనిపిస్తోంది. కాలుష్యం కట్టడికి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాతావరణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇదిలా ఉంటే వాతావరణ మార్పుల కారణంగా ఢిల్లీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘజియాబాద్, యూపీలో గాలి కాలుష్య తీవ్రత మరింత పెరిగింది. కాలుష్యంతో పాటు పొగమంచు కూడా చుట్టుముడుతుండటంతో పట్టపగలు కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత, కాలుష్య కారకాలు తీవ్రస్థాయిలో పేరుకుపోతున్నాయి. ప్రస్తుత పొగమంచు ఇలాగే కొనసాగితే.. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీసే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు. 

గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్ స్టాళ్లను కట్టడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. టెలికమ్యూనికేషన్, డేటా, వైద్యం, రైల్వేలు, ఎయిర్ పోర్టులు, టెర్మినల్స్, మురుగునీటి శుద్ధి కర్మాగారాల్లో మాత్రమే డీజిల్ జనరేటర్ల వినియోగానికి అనుమతివ్వాలని అంటున్నారు.